ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాల నిలుపుదల ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. పర్యాటకశాఖ రిసార్ట్ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలు ఉల్లంఘనకు పాల్పడిందీ లేనిదీ పరిశీలించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇవ్వాల్సివుందని గుర్తు చేసింది. ఆ నివేదిక వచ్చాకే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పింది. ఉల్లంఘనల గురించి కమిటీకి చెప్పేందుకు అనుమతినివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. కమిటీ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని స్పష్టం చేసింది. డిసెంబరు మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ రుషికొండను సందర్శించి నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్ జూపూడి యజ్ఞదత్ చెప్పారు. దీంతో విచారణను డిసెంబరు 27కు వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ప్రకటించింది.యందాడ గ్రామంలోని సర్వే నెంబరు 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతినివ్వడం కేంద్ర అటవీ, పర్యావరణ చట్టాలకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌లకు వ్యతిరేకమని దాఖలైన పిల్స్‌ను హైకోర్టు విచారణ జరిపింది.