27, 28న మహాధర్నా
బుక్‌లెట్ ఆవిష్కరణలో మాజీ మంత్రి వడ్డే
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు అనుకూలంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ప్రజాస్వామ్యానికి, దేశానికి రక్షణ అని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో కర్షక, కార్మిక ప్రజా సంఘాల సమన్వయ సమితి ముద్రించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతోందని అన్నారు. రైతు, కార్మిక, వ్యవసాయ కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పోరాటాలు చేసే ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. బిజెపిని 2024లో ఇంటికి పంపాలని అన్నారు. 385 రోజుల వీరోచిత పోరాటంతో మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేసుకున్న స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరువు తాండవిస్తోందని, ప్రజలంతా కరువు కోరల్లో కూరుకుపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 475 మండలాలు కరువు తీవ్రత అధికంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు తెచ్చి కార్మికులపై ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటించడం తగదన్నారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలోని జింఖానా మైదానంలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ బుక్‌లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు వి ఉమామహేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావు, ముజఫర్ అహ్మద్, ఎపి రైతు సంఘం నాయకులు కెవిపి ప్రసాద్, పి జమలయ్య, ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్, ఎం రామకృష్ణ, ఎ రవిచంద్ర, పి దుర్గాభవాని, దయా రమాదేవి, చంద్రానాయక్, ఎం హరిబాబు, ఎస్ అనిల్, శ్రీనివాస్, పరుచూరు రాజేంద్ర, యన్ లెనిన్, వి జాన్సన్ బాబు, ఆర్‌వి నర్సింహారావు, సుప్రజ, ఎ కమల తదితరులు పాల్గొన్నారు.