-పాలకులారా… మాకు ఎన్నాళ్లీ చీకటి బతుకులు
-విశాఖలో ఆదివాసీల వినూత్న నిరసన
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం):’పాలకులారా… మాకు ఎన్నాళ్లీ చీకటి బతుకులు. డోలీ మోతలు, మా ఇతర సమస్యలు మీకు కనబడవా?’ అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనిల, బూరుగ తదితర గ్రామాల ఆదివాసీలు విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన డోలీలు, కాగడాలు ప్రదర్శిస్తూ, అడ్డాకులు నెత్తిమీద టోపీలుగా పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ చిన్న కోనిల, బూరుగ తదితర 20 గ్రామాల్లో వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సరిహద్దులోని జాజులబందకు తక్షణం రోడ్డు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలని నినదించారు. అనంతరం తమ సమస్యలపై శనివారం జరుగుతున్న జిల్లా పరిషత్తు సమావేశంలో చర్చించాలని కోరుతూ జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి జిల్లా పరిషత్‌కు ర్యాలీగా బయలుదేరారు. జిల్లా కోర్టు సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంతకీ ఆదివాసీలు పట్టువిడవకపోవడంతో కొందరిని పోలీసులు తమ జీపులో జిల్లా పరిషత్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారు జడ్‌పి చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ గౌరవాధ్యక్షులు కె.గోవిందరావు, సిపిఎం నాయకులు మర్రి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి రోడ్డు సదుపాయమూ లేనందున జాజులబంద గ్రామానికి చెందిన గిరిజనులు ఏడు కిలోమీటర్ల దూరంలోని రోలుగుంట మండలానికి కొండకోనల గుండా నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. రోగులను, గర్భిణులను డోలీలతో మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోతోందన్నారు. బూరుగ, చిన్నకోనిలలోని భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు కొర్ర కొండబాబు, సోముల అప్పలరాజు, సింహాచలం, కిల్లో మహేష్, కోనేపర్రి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.