ప్రజాశక్తి – బనగానపల్లె, కడప ప్రతినిథినంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా అవుకు సమీపంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని పైలాన్‌ను ఆవిష్కరించారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి అదనంగా 10 వేల క్యూసెక్కులతో కలిపి మొత్తం 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు విడుదల చేశారు. రెండో సొరంగం పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు టన్నెళ్ల ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయరుకు తరలించి అక్కడి నుండి గాలేరు నగరి వరద కాలువ ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. ఆ జిల్లాలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జలవనరుల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్‌రెడ్డి, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గన్నారు.పెద్దదర్గాలో ప్రార్థనలుకడప అమీన్‌పీర్ దర్గాను గురువారం మధ్యాహ్నం సిఎం సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. అంతకుముందు అమీన్‌పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గా పీఠాధిపతుల వారిచే ”సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్” సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాననని తెలిపారు. ప్రార్థనలు అనంతరం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు.