మార్కెట్ రేటు కంటే రెండున్నర రెట్లు చెల్లిస్తే భూ యాజమాన్యపు హక్కులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వం తమ అనుయాయులకు, పెత్తందార్లకు భూములు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పేదల ముసుగులో గ్రామాల్లోని భూ స్వాములు, బడాబాబులు, పెత్తందార్లకు ఆయా భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం దొడ్దిదారిన మార్గాన్ని సుగమం చేస్తూ నిబంధనలు రూపొందించింది. అసైన్‌మెంట్ భూములు అనుభవిస్తున్న వ్యక్తికి ఎలాంటి కార్డు లేకపోయినప్పటికీ, భూమిలేని నిరుపేద కాకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ రేటు కంటే రెండున్నర రెట్లు భూ యజమాని చెల్లిస్తే సరిపోతుందని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ యాజమాన్యపు హక్కులు కల్పించే ముసుగులో బడాబాబులకు పాలకపక్షం పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చనున్నట్లు స్పష్టమవుతోంది. భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు దారిద్య్రపు రేఖకు దిగువున ఉన్న వారైతే మార్కెట్ రేటు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే వారు బిపిఎల్ పరిధిలో ఉండాల్సి ఉంటుందని, అలా కాకుండా అర్హత లేని వారైతే వారి పట్టా రద్దు చేసి, భూమి తీసుకుంటామని, అలా గాక మార్కెట్ రేటుకు రెండున్నర రెట్లు చెల్లిస్తే వారికి కూడా యాజమాన్యపు హక్కులు కల్పిస్తామంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27.14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో 15.21 లక్షల మందికి యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్నట్లు ఇటీవల సిఎం ప్రకటించారు. రెవెన్యూశాఖ నుంచి అందుతున్న సమాచారం మేరకు 10.60 లక్షల ఎకరాలు మాత్రమే నిజమైన అసైనీల చేతుల్లో ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. మిగిలిన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయా? లేక ఆక్రమణలకు గురయ్యాయా? అనే విషయంపై ప్రభుత్వం లెక్కలు తీసే పనిలో ఉన్నట్లు సమాచారం. భూమి లేని పేదలు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అసైన్‌మెంట్ కమిటీల ద్వారా భూ పంపిణీ జరిగింది. భూముల పంపిణీ జరిగి 20 సంవత్సరాలు దాటిన నిజమైన లబ్ధిదారులకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించడం ద్వారా పేదలకు ఆయా భూములపై (ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆర్ అసైన్‌మెంట్ ల్యాండ్స్) దక్కనున్నాయి. ఆయా భూములను వారి అవసరాలకు ఎప్పుడైనా అమ్ముకునే హక్కు (బదలాయింపు) చేసుకునే అవకాశం కలుగుతుంది. అసలైన లబ్ధిదారుని గుర్తించే ప్రక్రియ ఇలా.. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములకు భూ యాజమాన్యపు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు కింది మార్గదర్శకాలను సూచించింది. భూ యజమాని అసలైన లబ్ధిదారుడా? లేక వారసులా? తహశీల్దారు కార్యాలయంలోని డి పట్టా ఫైలు, 10(1) అడంగల్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. మాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకం, 1బి రిజిస్టర్, అడంగల్, వెబ్‌ల్యాండ్‌లో అసలైన లబ్ధిదారుని వివరాలు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించాలి. వారసుల విషయానికి వస్తే ఇసిలో లేకపోయినా, స్థానికంగా ఆ భూమి గురించి విఆర్‌ఒ పంచనామా నిర్వహించాలి. భూ యజమాని లేక వారసుల ఫొటోలను భూమి వద్ద తీయాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇ-క్రాప్ బుకింగ్, రైతు భరోసా అందుతుందా లేదా పరిశీలించాలి. భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 9(2) 10(2) నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం అసలైన భూ యజమానికి సంబంధించిన డాక్యుమెంట్లతో సహా ఫైలును తుది నిర్ణయం తీసుకునేందుకు జిల్లా స్థాయి కమిటీకి పంపాల్సి ఉంటుంది. అప్రూవల్ అయిన అనంతరం భూ యజమానికి భూ యాజమాన్యపు హక్కులు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. వ్యవసాయేతర భూముల ప్రక్రియ ఇలా..అసైన్‌మెంట్ ల్యాండ్ వ్యవసాయేతర భూమిగా మార్చుకుని ఉంటే అందులో మొత్తంగా మార్చుకుంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెన్‌మెంట్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదు కట్టించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు లోబడి ఎన్‌ఒసి కట్టుకోవాలి. పంచాయతీలకు సెస్ కట్టిన అనంతరం నాన్ అగ్రికల్చరల్ కింద సర్టిఫికెట్ ఇస్తారు. కొంత భాగం వ్యవసాయేతర భూమిగా మార్చుకుని ఉంటే ఆ భూమి యజమాని దారిద్య్రపు రేఖకు దిగువున ఉన్న వారైతే భూమిని లబ్ధిదారునిపేరు మీదనే ఉంచాలని సూచించారు.