- రూ.170 కోట్ల డిపిఆర్ ఆమోదించకుండా సౌత్ కోస్ట్ జోన్ నిర్మాణ పనులకు ఆర్డర్
- జివిఎల్ కపట ప్రకటనలపై పలువురు మండిపాటు
ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టం సెక్షన్ 93, షెడ్యూల్ (8)లో స్పష్టంగా 2016లో పేర్కొని ఇప్పటి వరకూ నాన్చుతున్న కేంద్రంలోని బిజెపి సర్కారు తాజాగా మరో మోసానికి తెర తీసింది. రూ.10 కోట్ల రైల్వే బడ్జెట్ ఆర్డర్ కాపీని చూపిస్తూ రూ.170 కోట్లతో ఇక్కడ నుంచి పంపిన డిపిఆర్‌ను బుట్టదాఖలు చేయడం చూస్తే కేంద్రం అసలు బండారం ఇట్టే అర్థమవుతుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు జరిగిపోతున్నట్లు రోజుకో మోసపు ప్రకటనలతో ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకూ బిజెపి నేతలు తెగ హడావుడి చేస్తున్నా ఆచరణలో 2020లో కేంద్ర రైల్వే బోర్డుకు పంపిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) రూ.170 కోట్లను మాత్రం ఆమోదించడం లేదు. తాజాగా 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు విశాఖలో రైల్వే జోన్ వచ్చేస్తోందని, రూ.10 కోట్లు వరకూ రైల్వేజోన్ ప్రారంభ పనులకు ఒక నిర్మాణ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొమ్మని తూర్పు కోస్తా రైల్వే అధికారులు (భువనేశ్వర్) నుంచి ఇచ్చిన ఒక ఆర్డర్ కాపీని మీడియాకు చూపిస్తున్నారు. ‘జోన్ డిపిఆర్‌ను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి ఇన్ని నాటకాలు దేనికి ? నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రూ.170 కోట్ల డిపిఆర్‌ను రైల్వే బోర్డు వద్ద నుంచి సాధించాలి. రూ.10 కోట్ల ఆర్డర్ చూపించడం దేనికి ? ఆయనకూ, ఈ రూ.10 కోట్లకూ సంబంధమే లేదు’ అంటూ తీవ్రస్థాయిలో పలువురు ధ్వజమెత్తుతున్నారు.
రూ.10 కోట్ల ఆర్డర్ ఏమిటి ?
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులను ప్రారంభించడం కోసం రైల్వే బోర్డు మంజూరు చేసిన రూ.10 కోట్లను వాడుకోవడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కోసం తూర్పు కోస్తా రైల్వే అధికారులు ఈ ఏడాది నవంబర్ 22న ఒక ఆర్డర్ పంపించారు. అయితే దీన్ని వాడుకోవాలన్నా ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్సు అండ్ సర్వే (ఐఆర్‌పిఎస్) ఆమోదం తీసుకోవాల్సి ఉంది. అది కూడా ఇంకా జరగలేదు. ఎందుకంటే డిపిఆర్‌లో భాగంగా రైల్వే జోన్ కోసం నిధులను వేరు చేయకూడదు. అంతేగాక రూ.170 కోట్లలో రూ.107 కోట్లు మాత్రమే డిపిఆర్‌లో చెప్పినట్లు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం వాడాల్సి ఉంది. మిగతా రూ.63 కోట్లు కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పనుల కోసం వెచ్చించాలి. కానీ అసలే లేదు.. కొసర బేరమా? అంటూ రైల్వే ఉన్నతాధికారులు వాపోతున్నారు. డిపిఆర్ గనుక ఆమోదం జరిగి ఉంటే రాయగడ పనులు జరిగి ఉండేవి. వాస్తవానికి రూ.10 కోట్లు మాత్రమే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనుల ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి ఆర్డరు వచ్చింది. జివిఎల్ ఈ శాంక్షన్ ఆర్డరును (ఆయనేదో సాధించినట్లు) చేత పట్టుకుని రైల్వే జోన్ పనులు మొదలైపోతున్నాయంటూ చెప్పడం హాస్యాస్పదమని, ఇది రైల్వేబోర్డు అంతర్గత బడ్జెట్ నిధులకు సంబంధించినదని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తాజాగా ‘ప్రజాశక్తి’ వద్ద ప్రస్తావించారు.
ప్రధాని వచ్చినా దిక్కులేదు
గత ఏడాది నవంబర్ 11న మోడీ విశాఖ వచ్చారు. ఆయన వెంట రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. విశాఖలో కొన్ని రైల్వే అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. అయితే, అప్పటికే రైల్వే అధికారులు డిఆర్‌ఎం ఆఫీసు పక్కన వైర్‌లెస్ కాలనీలో నూతన రైల్వే జోన్ శిలాఫలకం సిద్ధం చేసినా అక్కడకు మాత్రం వీరు వెళ్లలేదు. ఏదేమైనా రైల్వే జోన్‌పై ఇన్ని నాటకాలా ? అంటూ ఈ ప్రాంత ప్రజలు మోడీ సర్కారుపై మండిపడుతున్నారు.