నూరుశాతం ఇంగ్లీష్‌లోనే …పరీక్షలు రాసేలా చర్యలు

Dec 2,2023 08:36 #cm jagan, #review

విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తిాఅమరావతి బ్యూరోరాష్ట్రంలోని నూరుశాతం విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాసేలా తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీషులో పరీక్షలు రాయడమంటే ఉన భయాన్ని విద్యార్థుల నుండి తొలగించాలని సూచించారు. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశం మొత్తంగా 37.03శాతం మంది మాత్రమే ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం ఆ సంఖ్య 84.11శాతంగా ఉందని చెప్పారు. మిగిలిన పిల్లలకుకూడా చేయూత నివ్వాలని సిఎం చెప్పారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. డిసెంబర్‌ మూడో వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఐఎఫ్‌పి ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలని చెప్పారు. అన్ని పాఠశాలలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడుానేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిదశలో పూర్తయిన పాఠశాలల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం లో 6వ తరగతి నుంచి ప్యూచర్‌ స్కిల్స్‌పై పాఠ్యాంశాలను బోధిస్తున్నట్లు అధికారులు సిఎంకు తెలిపారు. డిసెంబర్‌ 21 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ చేస్తామన్నారు. ట్యాబుల బోధన ఉపాధ్యాయుల్లో మంచి మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. దాదాపు 7వేల ట్యాబులను డ్యామేజ్‌ అవ్వడంతో తిరిగి రీప్లేస్‌ చేశామన్నారు. పదో తరగతి ఫెయిలైన 1,49,515 మంది విద్యార్ధులు తిరిగి బడుల్లో చేరారని చెప్పారు. దేశంలో నూటికి నూరుశాతం పిల్లలను బడికి పంపడంలో నంద్యాల తొలిజిల్లాగా రికార్డు సృష్టించిందని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ఎపిఈడబ్ల్యూఐడిసి చైర్మన్‌ నాగార్జున యాదవ్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌, మౌలిక సదుపాయాల కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, సమగ్ర శిక్ష డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి, ఎపిఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండి ఎం మధుసూధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️