హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. నేడు రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లలో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారో తెలియాల్సి ఉంది. సాయంత్రం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరికాసెపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడ వెలువడున్నాయి.