క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లకు వెబినార్ ద్వారా మంగళవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాలో భాగంగానే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెద్దఎత్తున ప్రోత్సహకాలను ఇస్తున్నట్లు తెలిపారు. గోదావరి వరద ముంపునకు గురైన చింతూరు, విఆర్‌పురం, కూనవరం, ఎటపాక తదితర విలీన మండలాల్లో తాను పర్యటించినప్పుడు ససబ్‌స్టేషన్లు లేక సమస్యలు వస్తున్నాయని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై అధికారులతో చర్చించిన తరువాత 14 జిల్లాల్లో 28 సబ్ స్టేషన్లను చేసట్టామని అన్నారు. వీటికోసం రూ 3,099 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో 12 సబ్‌స్టేషన్‌ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి గ్రామానికి, ప్రతిరైతుకు అందించే వ్యవస్థను తీసుకువస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టామన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇచ్చేందుకు రూ 2.49లకే యూనిట్ ధరతో సోలార్ పవర్‌ను రాష్ట్రంలోకి తెచ్చామన్నారు. ఇందుకోసం 17వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టుల కింద 2024కు 3వేల మెగావాట్లు, సెప్టెంబరు 2025 నాటికి మరో 3వేల మెగావాట్లు, సెప్టెంబరు 2026 నాటికి మరో 1,000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందన్నారు.. ఈ ప్రాజెక్టులన్నింటి కోసం విద్యుత్ రంగంలో రూ 6,500కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. అలాగే కాలుష్యరహిత క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహకాలను ఇస్తోందని అన్నారు. అవేరా స్కూటర్స్ సంస్థ ఇప్పటికే 25వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించిందన్నారు. ఈ ప్రాజెక్టు లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా రూ 100కోట్లతో సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్నారు. ఈ కంపెనీ ద్వారా 100 మందికి ఉపాది అవకాశాలు వచ్చాయని తాజా పెట్టుబడితో మరో 200 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఎపి జెన్‌కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండి బి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.