-
46,463.82 ఎకరాలకు డికెటి పట్టాలు
-
దళితుల శ్మశాన వాటికలకు 951 ఎకరాలు కేటాయింపు
-
నూజివీడు బహిరంగ సభలో సిఎం జగన్
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : పేదల భూములపై వారికి సర్వ హక్కులు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ కొత్తగా డికెటి పట్టాలను అందిస్తున్నామని సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలకు సంబంధించి 42,307 మందికి డికెటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామన్నారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేయడం, చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఇనాం భూములను 22ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం సిఎం ప్రారంభించారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకున్న ఆయన భూపంపిణీ, సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ.. నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామని చెప్పారు. 17,406 రెవెన్యూ గ్రామాల్లో మొదటి, రెండు దశల్లో ఏకంగా నాలుగు వేల గ్రామాల్లో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతం చేశామని, మరో విడతగా రెండువేల గ్రామాల్లో పూర్తి చేసి ఇవాళ మూడో విడత కార్యక్రమం మొదలుపెడుతున్నామన్నారు. మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు అందజేశామని, 45 వేల సరిహద్దు తగాదాలు పరిష్కరించామని తెలిపారు. నాలుగువేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి ఈ గ్రామాల్లో 43.33 లక్షల కమతాలను నిర్ధారిస్తూ సరిహద్దు రాళ్లు పాతడం పూర్తి చేశామన్నారు. 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పించామని తెలిపారు. దీనివల్ల 27.42 లక్షల ఎకరాలకు సంపూర్ణ హక్కులు కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగుతుందన్నారు. చుక్కల భూమలను నిషేధిత జాబితా నుంచి తొలగించామని, దీంతో 2.6 లక్షల ఎకరాలకు సంబంధించి 1.2 లక్షల మంది రైతులకు మంచి జరుగుతుందని చెప్పారు. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు సర్వహక్కులు కల్పించామని తెలిపారు. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా కొన్న భూములకు సంబంధించి ఎస్‌సి రైతులకు రుణాలు మాఫీ చేస్తూ 22,387 ఎకరాలను నిరుపేదలైన 22,346 మంది దళితులకు హక్కులు కల్పించామన్నారు. గిరిజనులకు మంచి చేసేందుకు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీ చేపట్టామని, సాగు హక్కులు కల్పిస్తూ 1,56,655 గిరిజన కుటుంబాలకు 3,26,982 ఎకరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లంక భూములకు డికెటి, లీజు పట్టాలివ్వాలని నిర్ణయించి ఎ, బి కేటగిరీలకు డికెటి పట్టాలు, సి, డి కేటగిరిలో లీజు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకుని, 17,760 మంది నిరుపేదలకు మంచి చేశామన్నారు. సర్వీస్ ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 1,61,584 మంది కుమ్మరి, కమ్మరి, రజక, నాయీ బ్రహ్మణ తదితర వృత్తుల వారికి మంచి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూపంపిణీ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి వారి చేతుల్లో పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఇవేకాకుండా నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ.2.40 లక్షల కోట్లు వేశామని తెలిపారు.
- మోసపూరిత మాటలు నమ్మొద్దు
‘ 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎంతమందిని మోసం చేశారో చూశాం. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి, ఆయన గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అందరూ ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రతి ఇంటికి బెంజికారు, కేజీ బంగారం ఇస్తామంటారు’ అని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలు మోసపోవద్దని.. అబద్ధాలను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, ఎంపిలు కోటగిరి శ్రీధర్, మిథున్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గన్నారు.
- సిపిఎం నాయకుల ముందస్తు అరెస్టులు
సిఎం జగన్ నూజివీడు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లాలో పలుచోట్ల సిపిఎం నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడు మండలం గొల్లపల్లిలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, ఉంగుటూరు మండలం కైకరంలో కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కె.అప్పారావును నిడమర్రు మండలంలో భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి, సిపిఎం నేత నారపల్లి రమణరావును, ఇతర కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు గురువారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహనిర్బంధానికి పాల్పడడం అప్రజాస్వామికమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి విమర్శించారు.