టన్నెల్ కార్మికులను చేరుకోనున్న సహాయక బృందాలు

Nov 23,2023 12:08 #Tunnel, #Uttarakhand

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే కార్యక్రమం గురువారం తుది దశకు చేరుకోనుంది. నవంబర్‌ 12న ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సిల్కియారా టన్నెల్‌ కుప్పకూలిపోవడంతో.. 41 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సహాయక బృందం కార్మికులకు 12 మీటర్ల దూరంలో ఉన్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని, శిథిలాల నుండి బయటకు తీసిన కార్మికులను నేరుగా  ప్రాథమిక వైద్య కేంద్రంలోని ప్రత్యేక వార్డుకి తరలిస్తామని అన్నారు.

గత 12 రోజులుగా కార్మికులను బయటకు తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సొరంగంలో వారు ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు మంగళవారం రాత్రి నుంచి అమెరికన్‌ ఆగర్‌ యంత్రంతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. గంటకు 3 మీటర్లను డ్రిల్‌ చేసే ఈ యంత్రానికి గురువారం తెల్లవారుజామున ఓ మెటల్‌ అడ్డుతగిలింది. మెటల్‌ కట్టర్‌ సాయంతో అడ్డంకిని తొలగించి తిరిగి డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 800 మి.మీ. వ్యాసార్ధం ఉన్నస్టీలుపైపులను భూమికి సమాంతరంగా శిథిలాల ద్వారా 45 మీటర్ల మేర లోపలికి ప్రవేశపెట్టారు. ఇలాంటి పైపులు మరో 12 మీటర్ల దూరం వెళ్తే వాటిద్వారా కూలీలు సురక్షితంగా బయటకు తీసుకురావచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

➡️