ఉత్తరకాశీ టన్నెల్‌ ప్రమాదం.. 10వ రోజూ సొరంగంలోనే…

Nov 20,2023 22:39 #Uttar Pradesh

తొలిసారిగా బయటకొచ్చిన కార్మికుల విజువల్స్‌
మంగళవారం కూడా కొనసాగిన డ్రిల్లింగ్‌ పనులు
రిపోర్టింగ్‌ సమయంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హితవు పలికింది.
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం నుంచి కార్మికులను వెలికితీయడం మంగళవారం కూడా సాధ్యపడలేదు. దీంతో వరసగా 10వ రోజూ కూడా కార్మికులు సొరంగంలోనే చిక్కుకుని ఉన్నారు. అయితే తొలిసారిగా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి వీడియోను సహాయక సిబ్బంది మంగళవారం విడుదల చేశారు. కార్మికులకు ఆహారం, నీరు పంపిస్తున్న 6అంగుళాల ఫుడ్‌ పైప్‌లైన్‌ ద్వారా ఒక ఎండోస్కోపిక్‌ కెమెరాను ఉపయోగించి ఈ విజువల్స్‌ చిత్రీకరించారు. ఈ వీడియోలో కార్మికులు పసుపు- తెలుపు హెల్మెట్‌లు ధరించి, పైప్‌లైన్‌ ద్వారా వారికి పంపిన ఆహార పదార్థాలను స్వీకరించడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. దీంతో కార్మికులు సురక్షితంగా ఉన్నారనే భావన కలుగుతోంది. కార్మికుల కుటుంబాలకు కాస్త ఊరట లభించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి వచ్చిన ఎండోస్కోపిక్‌ కెమెరాను పైప్‌లైన్‌ ద్వారా పంపినట్లు అధికారులు తెలిపారు. నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్‌) డైరెక్టర్‌ అన్షు మనీష్‌ ఖల్కో కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఎలా ఉన్నారో చూడడానికి పైప్‌లైన్‌ ద్వారా కెమెరాలను చొప్పించనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఒక అధికారి మాట్లాడుతూ, సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తగినంత ఆహారం మరియు ఔషధాల సరఫరాను కొనసాగించడానికి 6 అంగుళాల పైప్‌లైన్‌ను ఉపయోగిస్తున్నామని, కార్మికులను రక్షించడానికి కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ చేయడంపై దృష్టి పెట్టామని చెప్పారు. అలాగే, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సైట్‌లో మొహరించి ఉన్నాయని తెలిపారు. కార్మికులతో కమ్యూనికేషన్‌ కోసం పరికారాలను పంపే ప్రణాళిక కూడా తమ వద్ద ఉందని చెప్పారు.
అతిగా స్పందించొద్దు
మీడియాను హెచ్చరించిన కేంద్రం
టన్నెల్‌ ప్రమాద వార్తలను, సహాయక కార్యక్రమాలను రిపోర్టింగ్‌ చేసేటప్పుడు మీడియా, టెలివిజన్‌ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం సూచించింది. ఈ సమస్యను సంచలనం చేయడం మానుకోవాలని, టన్నెల్‌ సైట్‌కు సమీపం నుంచి ఎలాంటి లైవ్‌ పోస్టులు, వీడియోలు నిర్వహించడం మానుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. ‘కార్మికుల విలువైన ప్రాణాలు రక్షించడానికి వివిధ ప్రభుత్వ సంస్థలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్‌ చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
పుష్కర్‌ సింగ్‌ ధామితో సంభాషించిన మోడీ
ఉత్తరకాశీలో జరుగుతున్న సహాయక కార్యక్రమాల గురించి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామితో ప్రధానమంత్రి మోడీ మంగళవారం ఫోన్‌ ద్వారా సంభాషించారు. కార్యక్రమాల గురించి ఆరా తీసారు. సహాయక కార్యక్రమాలకు అధిక ప్రాధన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు.

తాజా వార్తలు

➡️