లక్నో : హలాల్ ముద్రిత ఆహార పదార్థాలను తమ స్టోర్స్ నుండి 15 రోజుల్లోగా తొలగించాలని యుపి ప్రభుత్వం సోమవారం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్ట్స్, రిటైలర్స్, డిపార్ట్‌మెంట్ స్టోర్స్ నుండి వాటిని తొలగించాలని ఆదేశించింది. అలాగే ధ్రువీకరణ లేని సంస్థల నుండి హలాల్ ధ్రువీకరణ పొందుతున్న 92 ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలకు తమ ఉత్పతులను యుపిలో వెనక్కు తీసుకోవాలని లేదా తిరిగి ప్యాకేజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ముద్రిత ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకంపై ఈ నెల 18న యోగి ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ జిల్లాల్లోని 500 సంస్థలు మరియు రాష్ట్రంలోని 97 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు ఇప్పటివరకు సుమారు 2,500 కిలోల హలాల్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది.
అంతేకాకుండా నాలుగు సంస్థలపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)కి బదిలీ చేసింది. కొన్ని కంపెనీలు లాభాల కోసం, నిర్దిష్ట కమ్యూనిటీలో అమ్మకాలను పెంచేందుకు కొన్నింటిపై హలాల్ ఉత్పత్తులుగా ముద్రిస్తున్నాయని భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) ఆఫీస్ బేరర్ ఫిర్యాదు చేసింది. ఇది అతి పెద్ద ఫోర్జరీ, మోసం అని ఆరోపించింది. బిజెవైఎం ఫిర్యాదుతో ఐపిసిలోని 120బి (నేరపూరిత కుట్ర), 384 (దోపిడీ), 420 (మోసం), 467 (ఫోర్జరీ), 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీకి పాల్పడటం), 471 (నకిలీ పత్రాన్ని నిజమైనదిగా చూపడం), 153ఎ (రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టడం) మరియు 298 (ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను గాయపరచడం ) సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.