జైపూర్ : సీనియర్ కాంగ్రెస్ నేత రాజేష్ పైలెట్‌పై ప్రధాని మోడీ ఆరోపణలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం తిప్పి కొట్టారు. గుర్జార్లను రెచ్చగొట్టేందుకు ప్రధాని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో 8 నుండి 9 శాతం ఉన్న గుర్జార్ కమ్యూనిటీ ఓట్లు 30-35 సీట్లపై ప్రభావం చూపుతాయి. ” ప్రధాని మోడీ రాజేష్ పైలెట్ పేరును ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. రాజేష్ పైలెట్ పేరును ప్రస్తావించడం ద్వారా గుర్జర్ల కమ్యూనిటీని రెచ్చగొట్టాలని భావిస్తున్నారు. కానీ బిజెపి పాలనలో గుర్జర్లపై 22 సార్లు బుల్లెట్లను పేల్చారు. 72 మంది గుర్జర్లు మరణించారు.” బిజెపికి చెందిన వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో 2008 ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో గురువారం ఉదయం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. రాజేష్ పైలెట్ కుమారుడైన సచిన్ పైలెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ‘బలిపశువు’ ని చేస్తోందని వ్యాఖ్యానించారు.
గతంలో సోనియాగాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని రాజేష్ పైలెట్ వ్యతిరేకించారు. ఆయన కుమారుడు సచిన్ పైలెట్ ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నేతలలో ఒకరిగా ఉన్నారు. అయితే 2018లో రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని సచిన్ పైలెట్‌కు బదులుగా అశోక్‌గెహ్లాట్‌కు అధిష్టానం అప్పగించడం గమనార్హం. దీంతో అశోక్ గెహ్లాట్‌పై సచిన్ వర్గం తిరుగుబాటు ప్రకటించినప్పటికీ.. రాహుల్ గాంధీ చర్చలతో గొడవ సద్దుమణిగింది.