చెన్నై : తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదంలో మరింత తీవ్రమైంది. గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదం కోసం పంపిన పది బిల్లులను గురువారం ఆయన వెనక్కి పంపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్‌ల నియామకంలో గవర్నర్ అధికారాన్ని పరిమితం చేసే బిల్లు సహా పది బిల్లులను వెనక్కి పంపారు. ఈ బిల్లులను తిరిగి పంపేందుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం సమావేశం కానున్నట్లు సమాచారం.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను నెలలు, సంవత్సరాల తరబడి నాన్చుతున్న గవర్నర్ల తీరుపై సుప్రీం కోర్టు గతవారం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ విధమైన సంస్కృతికి ముగింపు పలకాలని, గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడినవారు కాదనే విషయం గుర్తెరిగి వ్యవహరిస్తే మంచిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మందలించింది. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ నాన్చుడు వైఖరిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది.