బిల్లులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ ఏదైనా బిల్లును తిరస్కరిస్తే దానిని ఆయుష్షు తీరినట్లుగా భావించరాదని సుప్రీంకోర్టు తన 27 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది. శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ తిరస్కరించడం లేదా ఆమోదించకుండా తన వద్ద అట్టే పెట్టుకోవడాన్ని తప్పుపడుతూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై త్రిసభ్య బెంచ్ తరఫున ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీర్పు రాశారు. ఇందులో గవర్నర్ల పాత్రపై పలు కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. తన వద్దకు వచ్చిన బిల్లులకు సంబంధించి గవర్నర్ తీసుకోవాల్సిన మూడు చర్యలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 స్పష్టంగా నిర్దేశించిందని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లును ఆమోదించడం, ఆమోదించకుండా అట్టే పెట్టడం, లేదా పార్లమెంట్ పరిశీలనకు బిల్లును రిజర్వ్ చేయడం మినహా గవర్నర్‌కు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. ద్రవ్య బిల్లు మినహా ఇతర బిల్లుల్ని గవర్నర్ ఆమోదించకుండా తన వద్దే ఉంచుకున్న పక్షంలో దానిని సాధ్యమైనంత త్వరగా శాసనసభకు తిప్పి పంపాలి. వాటిలో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ సందేశం పంపవచ్చు. లేదా బిల్లును కానీ, అందులోని నిబంధనల్ని కానీ తిరిగి పరిశీలించాల్సిందిగా కోరవచ్చు. బిల్లును తిరస్కరించిన తర్వాత దానంతట అదే జీవం కోల్పోయేలా చేయడం, మరోసారి ఆమోదం కోసం శాసనసభకు పంపడం… ఈ రెండింటి మధ్య గవర్నర్ వేరే అవకాశాన్ని ఎంచుకోరాదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును ఆమోదించరాదని గవర్నర్ నిర్ణయించుకున్నప్పుడు దానిని విధిగా శాసనసభకు తప్పి పంపాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఏదేమైనా బిల్లులపై అంతిమ నిర్ణయం రాష్ట్ర శాసనసభదే కానీ గవర్నరుది కాదని తేల్చి చెప్పారు. దీనర్థం గవర్నర్ తిప్పి పంపిన బిల్లును ఎలాంటి సవరణలు చేయకుండా శాసనసభ మరోసారి ఆమోదిస్తే దానికి ఓకే చెప్పడం మినహా గవర్నరుకు మరో ప్రత్యామ్నాయం లేదు. ‘గవర్నర్ ప్రజలు ఎన్నుకోని రాష్ట్ర ప్రభుత్వ అధిపతి. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ ఏదైనా ఓ తీర్మానం చేస్తే దానిని వీటో చేసే స్థితిలో గవర్నర్ ఉండవచ్చు. దానిని ఆమోదించడం లేదని తేలిగ్గా చెప్పవచ్చు. అయితే అలాంటి చర్య పార్లమెంటరీ పాలనా వ్యవస్థపై ఆధారపడిన ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంటుంది. రాజ్యాగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ శాసన వ్యవస్థలో ఓ భాగం. రాజ్యాంగబద్ధమైన పాలనకు గవర్నర్ కట్టుబడి ఉండాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో వివరించింది.