రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు : సుప్రీంకోర్టు ఆగ్రహం

Nov 21,2023 13:10 #farmers, #Punjab, #Supreme Court

న్యూఢిల్లీ : రైతును ఒక విలన్‌గా ముద్ర వేయడానికి ముందుగా ఆ రైతు బాధలేమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా వ్యాఖ్యానించారు. వరి పొలాలను ఉద్దేశ్యపూర్వకంగానే రైతులు తగలబెడుతున్నారని తద్వారా దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యానికి తన వంతుగా కారకుడవుతున్నారని విమర్శలు ఎదురవుతున్న వేళ జడ్జి వ్యాఖ్యలు వెలువడ్డాయి.
‘మీరందరూ కలిసి రైతును విలన్‌గా చేస్తున్నారు. అతడు విలన్‌ కాదు, అలా చేయడానికి అతనికి వుండే కారణాలు అతనికి వుంటాయి. అది ఎందుకు చేస్తున్నాడో మనకు చెప్పగలిగే వ్యక్తి అతనొక్కడే. కానీ అతనిక్కడ లేడు, మీరంటున్న విలన్‌ మాటలను వినడం లేదు. అతడు ఇక్కడకు రావాలి.’ అని జస్టిస్‌ థూలియా అన్నారు.
ఆదివారం ఒక్కరోజే పంజాబ్‌లో 748 ఎకరాల వ్యాప్తంగా వరి పొలాలను తగలబెట్టినట్లు అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది అపరాజిత సింగ్‌ కోర్టుకు తెలిపారు. తాము అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని పంజాబ్‌ ప్రభుత్వం చెబుతోంది, కానీ క్షేత్ర స్థాయిలో అది కనిపించడం లేదని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే రైతులు, కోర్టు ఆదేశాలు వున్నప్పటికీ, కాలుష్య పెంపునకు కారణమవుతున్నప్పటికీ పొలాలను తగలబెట్టే పరిస్థితుల పట్ల బాధ పడాల్సి వుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు డబ్బు ప్రయోజనాలను ఎందుకు పొందాలని జస్టిస్‌ కౌల్‌ ప్రశ్నించారు. అటువంటి రైతులను కనీస మద్దతు ధర పొందేందుకు ఎందుకు అనుమతిస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానంలో ప్రతి పక్షానికి ఒక ప్రతినిధి వున్నారు, రైతులకు మాత్రం లేరు, అలా ఎందుకు జరగాలి, రైతు ప్రతినిధులను కూడా తీసుకురావాలని అన్నారు. విపరీతంగా వరి పండించడం వల్ల పంజాబ్‌లో భూమి నిస్సారంగా మారిందని జస్టిస్‌ కౌల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

➡️