రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 09:10 #Assembly Elections, #poling, #Rajasthan

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. 6 గంటల తరువాత క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌కు వీలు కల్పించడంతో పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, గవర్నర్‌ కలరాజ్‌ మిశ్రా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ప్రతిపక్ష రాజేంద్ర రాథోర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అమ్రారామ్‌ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఒకటి, రెండు రాళ్లు రువ్వుకున్న సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సికార్‌ లోని బోచివాల్‌ భవన్‌, ఫతేపూర్‌ షెఖావతి సమీపంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఎన్నికల్లో 1862 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 5.29 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఈసారి 22.61 లక్షల మందికి ఓటు హక్కు లభించింది. 3 లక్షల మంది ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51,890 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,74,000 మంది ప్రభుత్వ సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించగా, 1,71,000 మంది పోలీసు, భద్రతా సిబ్బంది మోహరించారు. ఈసారి ఎన్నికల బరిలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్‌ సింగ్‌ డోటస్రా, విధాన సభ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత సీపీ జోషి తదితర హేమాహేమీలు ఉన్నారు. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.ఎన్నికల బహిష్కరణజైపూర్‌ జిల్లాలోని పాలావాలా జతన్‌ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ బూత్‌ వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్‌ గ్రామస్తులు కొన్ని సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్‌ బూత్‌ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఈ ఎన్నికలను మాత్రమే కాకుండా గత ఏడు పర్యాయాలు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు.

➡️