పూర్తయిన డ్రిల్లింగ్‌.. కాసేపట్లో టన్నెల్‌ నుండి బయటకు కార్మికులు ..

Nov 28,2023 15:39 #Tunnel, #Uttarakhand, #workers

 డెహ్రాడూన్‌  :   ఉత్తరకాశీలోని సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు.   టన్నెల్ నుండి  కార్మికులను బయటికి తీయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేలకు సమాంతరంగా డ్రిల్లింగ్‌ ఆగిన చోట నుండి 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు ‘ మిగిలిన డ్రిల్లింగ్‌ పూర్తి చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపినట్లు వెల్లడించాయి.

కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వైద్య చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపాయి. సిల్కియారా టన్నెల్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ వద్ద తాత్కాలిక వార్డ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. కార్మికులను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగా గ్రీన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లను కూడా సొరంగం వద్ద సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండాలని కార్మికుల కుటుంబసభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. దీంతో కార్మికుల కుటుంబసభ్యులు టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 12న ఉత్తరాఖండ్‌లోని సిల్కియారాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌ కుప్పకూలడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గత 17 రోజులుగా వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి.

మాన్యువల్‌ డ్రిల్లింగ్‌, పైపింగ్‌ పనులు పూర్తయ్యాయని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి వెల్లడించారు. త్వరలో కూలీలను బయటకు తీసుకురానున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

➡️