న్యూఢిల్లీ : భారతదేశంలో ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE), యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISEP )లు విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. 18-23 సంవత్సరాల వయస్సు గల ముస్లిం విద్యార్థుల విద్యపై విశ్లేషణ జరిపి సేకరించిన ఆధారాల ప్రకారం 2020-21లో గత ఏడాది కంటే 8.5 శాతం తగ్గింది. 2019-20లో 21 లక్షల మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకోగా, 2020-21 నాటికి వారి సంఖ్య 19.21 లక్షలకు పడిపోయింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ప్రొఫెసర్ అరుణ్ సి.మెహతా ”భారతదేశంలో ముస్లిం విద్య స్థితి” అనే నివేదికను రూపొందించారు. 2016-17లో 17,39,218 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యలో చేరగా, 2020-21 నాటికి వారి సంఖ్య 19,21,713కి పెరిగింది. అయితే 2019-20లో 21,00,860 మందికి చేరగా, 2020-21లో 19,21,713 మందికి పడిపోయింది. ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఉన్నత విద్యలో చేరిన ముస్లిం విద్యార్థుల శాతం కూడా స్వల్పంగా తగ్గింది, ఇది 2016-17లో 4.87 నుండి 2020-21లో 4.64కి పడిపోయింది. మొత్తం నమోదు చేసుకున్న 6.67 కోట్ల మంది ముస్లిం విద్యార్థులలో ఎగువ ప్రాథమిక స్థాయిలో (6-8వ తరగతి) దాదాపు 14.42శాతం ఉండగా, ద్వితీయ స్థాయిలో (9-10వ తరగతి) 12.62శాతం, ఉన్నత మాధ్యమిక స్థాయిలో (11-12వ తరగతి) స్వల్పంగా తగ్గి 10.76 శాతం గా ఉందని నివేదిక పేర్కొంది.
సెకండరీ లెవల్‌లో చేరిన ముస్లిం విద్యార్థుల్లో 18.64 శాతం మంది విద్యకు దూరమవుతున్నారని, మొత్తం విద్యార్థుల్లో వీరి డ్రాపౌట్ రేటు 12.6 శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అస్సాం (29.52శాతం), పశ్చిమ బెంగాల్ (23.22 శాతం ) ముస్లిం విద్యార్థులలో అధిక డ్రాపౌట్ రేటు నమోదు కాగా, జమ్మూ మరియు కాశ్మీర్‌లో 5.1 శాతం మరియు కేరళలో 11.91శాతం నమోదయ్యాయి.”సమగ్ర విధానాలను అమలు చేయడం ద్వారా అంతరాలను తగ్గించడంలో మరియు అందరికీ సమాన విద్యా అవకాశాలను అందించడంలో సహాయపడుతుంది” అని నివేదిక స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు కావడంతో ఉన్నత విద్యకు ఖర్చును భరించలేకపోతున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి .. అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాల్సి వుందని పేర్కొంది. ముస్లిం విద్యార్థుల కోసం కేటాయించిన స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు మరియు ఆర్థిక సహాయ అవకాశాల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి వుందని తెలిపింది. దీంతో అర్హులైన అధిక శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందని నివేదిక సూచించింది.