ఒడిశా : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కెందుజార్‌లో శుక్రవారం ఉదయం 5 గంటలకు 20వ నంబర్ జాతీయ రహదారి బలిజోడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు వ్యాన్ లో తారిణి దేవి ఆలయ దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగివున్న ట్రక్కును వ్యాన్ వేగంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే 8మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 12 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.