భువనేశ్వర్ : గిరిజనుల భూములను గిరిజనేతరులకు బదిలీ చేసేందుకు అనుమతించే నిర్ణయాన్ని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ మరియువిపత్తు నిర్వహణ మంత్రి సుదాము మరాండి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టిఎసి) మరింత చర్చ జరపాలని సిఫారసు చేసినట్లు తెలిపారు. టిఎసి సిఫారసు ప్రకారం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ నెల 14న ఒడిస్సా షెడ్యూల్డ్ ఎరియాస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రోపర్టీ (ఒఎస్‌ఎటిఐపి) రెగ్యులేషన్, 1956ని సవరించేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. పది రోజుల వ్యవధిలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తన సొంత నిర్ణయాన్ని రెండు సార్లు వెనక్కు తీసుకోవడం అసాధారణం కావడం గమనార్హం. నవంబర్ 14న రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తర్వాత .. ఒఎస్‌ఎటిఐపిని సవరించే ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మరాండి ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.
గిరిజనులకు వ్యవసాయం, నివాస గృహాల నిర్మాణం, పిల్లల ఉన్నత చదువుల కోసం మాత్రమే బ్యాంకు రుణాలు పొందేందుకు సడలింపు ఇవ్వాలని మాత్రమే టిఎసి డిమాండ్ చేసినట్లు ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే టిఎసి సిఫారసుకు విరుద్ధంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని భూములను గిరిజనేతరులకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆమోదించిందని మండిపడుతున్నాయి.