బెంగళూరు : ప్రధాని మోడి శనివారం తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడి కర్నాటకలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం మోడి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హల్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్‌ను ప్రధాని పరిశీలించారు. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో విహరించారు. ఆ ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
” తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశాను. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థ్యంపై నా విశ్వాసం మరింత పెరిగింది. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల నాకు గర్వంగా ఉంది. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకితభావానికి నిదర్శనం. స్వావలంబనలో మనం ప్రపంచంలో ఎవరి కంటే తక్కువ కాబోమని నేను గర్వంగా చెప్పగలను. భారత వాయుసేన, డీఆర్‌డీవో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హల్)కు హృదయపూర్వక అభినందనలు ” అని మోడి రాసుకొచ్చారు.
ఎయిర్‌ఫోర్స్, భారత నేవీ వినియోగిస్తున్న తేజస్ ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్‌లో ప్రధాని నేడు విహరించారు. ఈ తేలికపాటి యుద్ధ విమానాన్ని తొలుత వాయుసేన కోసం హల్ రూపొందించింది. ఆ తర్వాత గ్రౌండ్ మారిటైమ్ ఆపరేషన్స్ కోసం నావెల్ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తున్నారు. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన ఎఫ్ 414 ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌తో కలిసి భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఇంజిన్లను తేజస్ మార్క్-2 యుద్ధవిమానాల్లో అమర్చనున్నారు.