నన్ను కావాలని ఇరికించారు : మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌ కొరియర్‌

 

న్యూఢిల్లీ : మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ రూ. 508 కోట్లు తీసుకున్నట్లు ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఆరోపించింది. ఈ కేసులో డబ్బులు అందించిన అసిమ్‌ దాస్‌ అనే కొరియర్‌ను నవంబర్‌ 3వ తేదీన.. సరిగ్గా ఛత్తీస్‌గఢ్‌ తొలిదశ పోలింగ్‌ జరిగే నాలుగురోజుల ముందు ఇడి అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. అసిమ్‌ దాస్‌ తాను ఏ రాజకీయ నాయకుడికి డబ్బుల్ని ఇవ్వలేదని, తనని కావాలని ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. ఈ మేరకు అతను జైలు నుంచే ఇడి డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో తనను కావాలని ఈ కేసులో ఇరికించారని దాస్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘నా వాంగ్మూలాన్ని ఇంగ్లీషులో రాశారు. ఆ భాష నాకు అర్థం కాలేదు. పైగా వాంగ్మూలంపై ఇడి అధికారులు నాచేత బలవంతంగా సంతకం చేయించారు.’ అని దాస్‌ తన లేఖలో రాశారు. ‘ఈ యాప్‌కు ప్రధాన సూత్రధారి శుభమ్‌ సోని అనే వ్యక్తి. శుభమ్‌ తనకు చిన్ననాటి స్నేహితుడు. అతను పట్టుబడడంతో ఈ ఏడాది అక్టోబర్‌లో రెండుసార్లు అతనితో కలిసి నేను దుబారుకి వెళ్లాను. సోనికి కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేయడానికి ఆసక్తి చూపేవాడు. ఈ వ్యాపారంలో తనకు సహాయం చేయమని, తన దగ్గరే ఉండమని సోనీ నన్ను కోరాడు. ఈ బిజినెస్‌కి డబ్బుల్ని ఏర్పాటు చేస్తానని హామీ కూడా ఇచ్చాడు.’ అని దాస్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘ఒకరోజు నేను రారుపూర్‌ ఎయిర్‌పోర్టులో దిగాను. అప్పుడు శుభమ్‌ నన్ను కారు తీసుకుని విఐపి రోడ్‌లోని హోటల్‌లోకి వెళ్లమని, ఓ ప్రదేశంలో కారు పార్కు చేయమని చెప్పాడు. అప్పుడు ఓ వ్యక్తి కారు దగ్గరికి వచ్చి డబ్బులున్న బ్యాగులను పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌లో నన్ను తిరిగి హోటల్‌కి వెళ్లమని చెప్పారు. కొంతసమయం తర్వాత ఇడి అధికారులు హోటల్‌లోని నా గదికి వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఇదంతా జరిగిన తర్వాత నాకు అర్థమైంది. నేను ఏ రాజకీయ నాయకులకు లేదా కార్యకర్తలకు గానీ ఎవరికీ కూడా నేను డబ్బును అందించలేదు.’ అని దాస్‌ ఇడి అధికారికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే బెట్టింగ్‌లు, హవాలా సిండికేట్‌లను కొనసాగించేందుకు పోలీసులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు యాప్‌లో వాటా ఇచ్చారని ఈడీ అరెస్టు చేసిన నిందితుల్లో ఒకరు గతంలో పేర్కొన్నారు. యాప్‌ కోసం యాడ్స్‌లో నటించిన బాలీవుడ్‌ నటులు రణబీర్‌ కపూర్‌, శ్రద్ధాకపూరల్‌ను కూడా ఇడి ప్రశ్నిస్తోంది.

➡️