న్యూఢిల్లీ : ఢిల్లీ చీఫ్ సెక్రటరీ (సిఎస్)గా నియమించేందుకు మరో ఐఎఎస్ అధికారి లేరా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సిఎస్ నరేష్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలనే కేంద్రం ఏకపక్ష నిర్ణయంపై వివరణనివ్వాలంటూ 24 గంటల సమయమిచ్చింది. మరో ఆరు నెలల పాటు నరేష్‌కుమార్‌ను కొనసాగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమను సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త సీఎస్‌ను నియమించటానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ సిఎస్‌గా నియమితులు కావడానికి అర్హతలున్న మరో ఐఎఎస్ అధికారి లేరా అని ప్రశ్నించింది. ఏ అధికారంతో పదవీకాలాన్ని పొడిగించాలనుకుంటున్నారని నిలదీసింది. ఈ ప్రతిపాదనకు గల కారణాలను బుధవారం లోగా వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నరేశ్ కుమార్ పదవీకాలం గురువారం (నవంబర్ 30)తో ముగియనుంది.