గాజా : గాజాపై ఇజ్రాయిల్ మళ్లీ వైమానిక, ఫిరంగి దాడులతో విరుచుకుపడుతోంది. ఒప్పందం ముగియడంతో గాజాలో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించినట్లు ఇజ్రాయిల్ సైన్యం శుక్రవారం ప్రకటించింది. ఇజ్రాయిల్ -హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం ఉదయంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం పొడిగింపుపై ఇరువర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సంధి ముగిసినట్లైందని, దీంతో గాజాలో మళ్లీ దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.
హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తమ భూభాగంపై కాల్పులు జరిపిందని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపించింది. గాజా నుండి ప్రయోగించిన రాకెట్‌ను తాము అడ్డుకున్నామని మిలటరీ ప్రకటించిన కొద్దిసేపటికే యుద్ధం ప్రారంభించామన్న ప్రకటన వెలువడటం గమనార్హం. ఒప్పందం ముగిసిన వెంటనే గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టిందని, ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బాంబు పేలుడు, కాల్పులు వినిపించాయని మీడియా వెల్లడించింది.
ఖతార్, ఈజిప్టు దేశాల ప్రయత్నంతో ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మొదట నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. నవంబరు 24న ఈ ఒప్పందం అమల్లోకి రాగా.. అనంతరం ఈ ఒప్పందాన్ని మరో రెండు సార్లు పొడిగించారు.ఈ ఒప్పంద సమయంలో హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ జైళ్లలో మగ్గుతున్న 240 మందికి పైగా పాలస్తీనియన్లను విడుదల చేసింది. వీరంతా చిన్నారులు, మహిళలే కావడం గమనార్హం.