బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలి : కార్మిక, కర్షక మహాధర్నా పిలుపు

farmers workers protest in kerala

భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తాం : నేతలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోప్రజలను, దేశాన్ని రక్షించడానికి బిజెపిని అధికారం నుంచి తరిమి కొట్టాలని ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపఢావ్‌’ పిలుపునిచ్చింది. మోడీ సర్కార్‌ కార్మిక, రైతు, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా మూడు రోజుల మహాధర్నా విజయవంతమైంది. ఈ చారిత్రాత్మక మహాధర్నాను విజయవంతం చేసినందుకు కార్మికులు, రైతులకు కార్మిక, రైతు సంఘాలు అభినందనలు తెలిపాయి. అనేక రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌లకు మెమోరాండం, చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను సమర్పించడంతో మహాధర్నా పోరాటం ముగిసింది.రైతు, కార్మిక నేతలపై కేసులు నమోదు చేసి, ఎన్నో అడ్డంకులు సృష్టించినా, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, మూడు రోజులపాటు మహాధర్నా చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సెక్టోరల్‌ ఫెడరేషన్లు/ సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా సంయుక్త వేదిక పిలుపు మేరకు ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన మహాధర్నాలో లక్షల మంది కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారు. వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. అనేక మంది మేధావులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులు సంఘీభావం తెలిపారు. సిపిఎంతోపాటు వివిధ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అండమాన్‌ నికోబార్‌ రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌, త్రిపురలోని అగర్తల, పాండిచ్చేరితో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధాని నగరాల్లో రాజ్‌ భవన్‌ (గవర్నర్‌ కార్యాలయం)ల ఎదుట మూడు రోజుల పాటు మహాధర్నా నిర్విరామంగా జరిగింది. మూడు రోజులపాట ఆందోళన సైట్ల వద్దే వంటావార్పు చేసుకుని, తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని రాత్రుళ్లు అక్కడే బస చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రైతు ఉత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలపాటు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఆందోళనలో అమరులైన రైతులకు పరిహారం ఇవ్వాలని, దోషులను శిక్షించాలని ఎస్‌కెఎం, సిటియు డిమాండ్‌ చేశాయి. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికుల డిమాండ్లపై మరింత నిర్ణయాత్మక, ఉమ్మడి పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశాయి. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేసేందుకు కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లోగానీ ఏ ప్రభుత్వమూ సాహసం చేయనంత స్థాయిలో కార్మికులు, రైతుల ఉమ్మడి, సమన్వయ పోరాటాలు బలోపేతం అవుతాయని నేతలు పిలుపునిచ్చాయి. ఇడి, సిబిఐ, ఎన్‌ఐఎ వంటి దర్యాప్తు సంస్థల సహాయంతో యుఎపిఎ, దేశద్రోహ చట్టం వంటి చట్టాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష సభ్యులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. న్యూస్‌క్లిక్‌ మీడియా ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అమిత్‌ చక్రవర్తి చారిత్రాత్మక రైతు పోరాటంపై నిజం, వాస్తవాలను ప్రచురించినందున కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిందని విమర్శించింది. ప్రజల డిమాండ్లపై మరింత భారీ, ఐక్య పోరాటాలు చేస్తామని ఎస్‌కెఎం, సిటియుఎస్‌లు హెచ్చరించాయి.ఈ సందర్భంగా రైతు, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. దేశ, విదేశీ బ్రాండ్‌లకు చెందిన కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల జీవితాన్ని దుర్భరం చేసిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవించడంలేదని, ఉల్లంఘించిన వారికి అండగా నిలుస్తుందని అన్నారు. మహాపడావ్‌ కార్యక్రమాలను సమీక్షించిన అనంతరం సిటియులు, ఎస్‌కెఎం తదుపరి దశ ఆందోళనలను నిర్ణయిస్తామని నాయకులు తెలిపారు.ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో సిఐటియు అధ్యక్షులు కె హేమలత మాట్లాడుతూ.. నయా ఉదారవాద విధానాల వ్యవస్థాగత సంక్షోభం నుండి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించాలని కార్మికులు, రైతులు కోరుతున్నారని అన్నారు. వేతనాలు పెంచడం, ప్రభుత్వ నిధులతో సామాజిక భద్రతా చర్యలను విస్తరించడం, వ్యవసాయ ఇన్‌పుట్‌లతో సహా రైతులకు సబ్సిడీ, ప్రభుత్వ యాజమాన్యంలోని మండీలు, ఎంఎస్‌పి, రైతుల కష్టాలను తీర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, ఎఐసిసిటియు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ దిమ్రి, ఎఐకెఎస్‌ కోశాధికారి కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో తపన్‌ సేన్‌ (సిఐటియు), అశోక్‌ సింగ్‌ (ఐఎన్‌టియుసి), ఎఆర్‌ సింధు (సిఐటియు), ఆర్‌ కె శర్మ (ఎఐయుటియుసి), షణ్ముగమ్‌ (ఎల్‌పిఎఫ్‌), మనలి (ఎస్‌ఇడబ్ల్యుఎ), అశోక్‌ ఘోష్‌ (యుటియుసి), ఇందుప్రకాష్‌ మీనన్‌ (టియుసిసి), ఎస్‌కెఎం నేతలు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌, హన్నన్‌ మొల్లా, రాకేష్‌ తికాయత్‌, దర్షన్‌ పాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహాన్‌, సునీలం, అవిక్‌ సాహా తదితరులు పాల్గొన్నారు.

➡️