- పాలస్తీనాకు అండగా నిలవాలి : పీపుల్స్ డెమొక్రసీ వ్యాఖ్య
న్యూఢిల్లీ : పాలస్తీనియన్లను ముస్లిం తీవ్రవాదులుగా చిత్రించేందుకు హిందూత్వశక్తులు, దాని అధీనంలోని కార్పొరేట్ మీడియా బాకాలు చేస్తున్న యత్నాల పట్ల పీపుల్స్ డెమొక్రసీ (పీడి) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి మతం రంగు పులిమి ఇస్లామిక్ ఫోబియాను రెచ్చగొట్టాలని బిజెపి చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకతను అది నొక్కి చెప్పింది. పీపుల్స్ డెమొక్రసీ తన తాజా సంచికలో ప్రచురించిన సంపాదకీయంలో హిందూత్వ-యూదు పొత్తు, దాని ప్రమాదం గురించి హెచ్చరిస్తూ ఇలా వ్యాఖ్యానించింది.
” గాజాపై ఇజ్రాయిల్ అమానుష యుద్ధంలో మరణించిన పాలస్తీనా చిన్నారులను గుర్తు చేసుకుంటూ బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా నూతన భారతదేశంలో నేరమైపోయింది. ముంబయిలో నవంబరు 14న జుహూ బీచ్‌లో మైనర్ బాలికలతో పాటు కొద్దిమంది, పాలస్తీనా చిన్నారుల కోసం మౌనంగా ప్రార్ధనలు జరిపారు. వారిలో 17మందిని పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లోనే అట్టిపెట్టారు. వీరందరూ కూడా మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారే. గాజాలో 5,600మంది చిన్నారులు మరణిస్తే ఆ పరిణామాలు బిజెపి పాలకులను కొంచెం కూడా కదిలించలేకపోయాయి.
అదే రోజు, ఢిల్లీ పోలీసులు వివిధ మసీదుల ఇమామ్‌లకు నోటీసులు పంపడం, ప్రార్ధనలు, సమావేశాల సందర్భంగా గాజాలో ఇజ్రాయిల్ బలగాల దాడులు గురించి లేదా పాలస్తీనా గురించి ప్రస్తావించవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. గాజాలో మరణించిన వేలాదిమంది స్మృత్యర్ధం ప్రార్ధన జరపరాదంటూ నిషేధం విధించడం ప్రాధమిక హక్కు అయిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే కాకుండా మత స్వేచ్ఛపై కూడా దాడి చేయడమే..
అక్టోబరు 13న, ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో ప్రార్ధనలు మానేయాల్సిందిగా శ్రీనగర్‌లోని ప్రధాన మసీదు అయిన జామియా మసీదుకు నగర యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రార్ధనల సమయాల్లో గాజాలోని ప్రజలకు సంఘీభావం తెలియచేయకుండా అడ్డుకునేందుకు యత్నించిందని పీపుల్స్ డెమొక్రసీ విమర్శించింది.
బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలో, పాలస్తీనాకు మద్దతుగా ఎలాంటి నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీసులు నిషేధం విధించారు. ఢిల్లీలో కూడా, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేస్తుండగా విద్యార్ధులు, ఇతర నిరసనకారులను పోలీసులు చుట్టుముట్టారు. ఇజ్రాయిల్‌ను అతిగా పొగుడుతూ, పాలస్తీనా పోరాటాన్ని తీవ్రవాదంగా చిత్రీకరించే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ దృక్పథం కారణంగానే ఈ చర్యలన్నీ చోటు చేసుకున్నాయి. ఒకపక్క అంతర్జాతీయంగా పేద, వర్ధమాన దేశాలన్నీ గాజాలో సాగుతున్న యుద్ధంలో కాల్పుల విమరణ జరగాలని డిమాండ్ చేస్తుంటే, మరోపక్క ఇజ్రాయిల్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ, కాల్పుల విరమణ పిలుపునకు మద్దతు ఇవ్వడానికి కూడా తిరస్కరిస్తూ మోడీ ప్రభుత్వ వైఖరిలో వచ్చిన పూర్తి మార్పును ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.
హిందూత్వ, మితవాద యూదు ఉన్మాదం ఈ రెండూ సైద్ధాంతిక సోదరుల వంటివి. హిందూత్వ భావనకు మూలకర్త అయిన వి.డి.సావర్కర్ పాలస్తీనాలో యూదు దేశం ఏర్పాటుకు మద్దతిచ్చినట్లు 1923లోనే రాసుకున్నారు. యూదు వాదానికి సావర్కర్ ఎప్పుడూ మద్దతిచ్చేవారు. దాన్ని ఆయన ముస్లిం వ్యతిరేకిగా చూశారు. దీనికి పూర్తి విరుద్ధంగా, పాలస్తీనా ప్రయోజనాలకు గాంధీóజీ కూడా అంతే దృఢంగా మద్దతిచ్చారు. ”అరబ్బులపై యూదులను రుద్దడం తప్పు, అమానవీయం” అని 1938లో గాంధీజీ రాశారు. ఈనాడు పాలస్తీనాలో జరుగుతున్నదాన్ని ఏ నైతిక ప్రవర్తనా నియమావళితోనూ సమర్ధించలేం.
పాలస్తీనాపై భారత్ వైఖరిని మోడీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేయడమనేది బిజెపి నేతృత్వంలోని మొదటి వాజ్‌పేయి ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో పెట్టుకున్న వ్యూహాత్మక సంబంధాలకు పరాకాష్టగా వుంది. ఆనాడు ఉప ప్రధాని హౌదాలో ఎల్.కె.అద్వానీ 2000 సంవత్సరంలో ఇజ్రాయిల్‌లో పర్యటించారు. అలా పర్యటించిన మొదటి అత్యున్నత భారత ప్రభుత్వ నేత ఆయనే. ఈ ధోరణి వివిధ మిలిటరీ, భద్రతా సంబంధాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. తదనంతరం ఇజ్రాయిల్ ప్రధాని ఏరియల్ షరోన్ భారత్‌లో పర్యటించారు. యూదు మితవాద విభాగానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. భారత్‌లో పర్యటించిన మొదటి ఇజ్రాయిల్ ప్రధాని ఆయనే. ఈ వ్యూహాత్మక పొత్తు నరేంద్ర మోడీ, మితవాద ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మరింత ముందుకు తీసుకెళ్లారు. మోడీ ప్రభుత్వానికి అంతర్గత భద్రతా వ్యవస్థకు అవసరమైన పరికరాలను, సాంకేతికతను అందించే కీలక సరఫరాదారుగా ఇజ్రాయిల్ మారింది. అటువంటి సాంకేతికతల్లో ఒకటే పెగాసస్ స్పైవేర్. ఇజ్రాయిల్ ప్రభుత్వ ఆమోదంతో ఒక ఇజ్రాయిల్ కంపెనీ దీన్ని సరఫరా చేసింది. గాజాపై సాగించిన మారణకాండ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు,, ఆందోళనలను లేవనెత్తింది. ఖండనలకు గురైంది. ఇజ్రాయిల్‌కు పూర్తిగా మద్దతిచ్చే దేశాల్లో కూడా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి గాజా ప్రజలకు, పాలస్తీనాకు మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. బ్రిటన్‌లో, కన్జర్వేటివ్ ప్రభుత్వం, ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకత్వం రెండూ గాజాలో ఇజ్రాయిల్ ఊచకోతకు పూర్తిగా మద్దతిచ్చాయి. అయినా సరే వందల వేల సంఖ్యలో ప్రజలు ప్రతి శనివారం ప్రదర్శనలు నిర్వహిస్తూనే వున్నారు. ఇటువంటి నిరసనలను, పాలస్తీనా పతాకాలను ప్రదర్శించడాన్ని ఫ్రెంచి, జర్మనీ ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా పారిస్, బెర్లిన్‌ల్లో నిరసనలు జరిగాయి.నాలుగు రోజుల పాటు గాజాలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో బందీలుగా వున్న 50మంది మహిళలు, చిన్నారులను విడుదల చేస్తే అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్ళలో మగ్గుతున్న 150మంది పాలస్తీనా మహిళలను, చిన్నారులను విడుదల చేయడమన్నది తాత్కాలిక ఉపశమనం. కాల్పుల విరమణ సమయం ముగిసిన తర్వాత మళ్ళీ యుద్ధం సాగుతుందని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అందువల్లే, ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనేవరకు, శాశ్వత కాల్పుల విరమణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలన్నది కీలకాంశంగా వుంది. భారత్‌లో, పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కేరళలో అన్ని జిల్లాల్లో వేలాదిమంది ప్రజలు పాల్గొంటున్నారు. కోల్‌కతాలో వామపక్షాలు పెద్ద ప్రదర్శన నిర్వహించాయి. వివిధ రాష్ట్రాల్లో సంఘీభావ చర్యలు, సమావేశాలను కూడా వామపక్షాలు నిర్వహిస్తున్నాయి. పాలస్తీనియన్లను ముస్లిం తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ బిజెపి, కార్పొరేట్ మీడియా ఆధిపత్యంతో కూడిన మతపరమైన కథనాలు ఇస్తున్న తీరును దృష్టిలో పెట్టుకుంటే మరోవైపు లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఎదురు తిరగకుండా నిష్క్రియాపరత్వంతో వ్యవహరిస్తున్నాయి. అందువల్ల, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయడానికి, పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయిలీల ఆక్రమణను అంతమొందించడానికి, అలాగే శాశ్వతంగా కాల్పుల విరమణకు మద్దతుగా వామపక్షాలు విస్తృత రీతిలో, నిలకడగా ప్రచారం చేపట్టడం ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం జరిగే ప్రజా సమీకరణలో ఇతర లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడా కలుపుకుంటూ, దీన్నొక ఇస్లామోఫోబిక్ అంశంగా మార్చడానికి బిజెపి చేస్తున్న ప్రణాళికను భగం చేయాల్సి వుంది.” అని పీపుల్స్ డెమొక్రసీ పేర్కొంది.