ఢిల్లీలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Nov 20,2023 12:38 #air pollution, #Delhi

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుండి తెరుచుకున్నాయి. అయితే క్రీడలు, ప్రార్థనలు వంటి బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.   పేలవమైన వాయునాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం నవంబర్‌ 9 నుండి 18 వరకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలకు వెళ్లే సమయంలో కాలుష్యం బారిన పడకుండా తల్లిదండ్రులు, పిల్లలు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్  కోరారు.

నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇందులో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులు ఫిజికల్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే, కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను మూసివేయాలని నిర్ణయించాయి.  కాలుష్యం ఇప్పటికీ పూర్‌ కేటగిరీలోనే ఉందని, అందుకే చిన్న పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రైవేట్‌ పాఠశాలలు పేర్కొన్నాయి. పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలపై నిషేధం, విద్యార్థులను మాస్క్‌లు ధరించాల్సిందిగా ఆదేశించింది. వాయు కాలుష్యం నుండి తమను తాము రక్షించుకునే మార్గాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కొన్ని పాఠశాలలు యోచిస్తున్నాయి.

➡️