డీప్‌ఫేక్‌పై త్వరలో నూతన చట్టం : కేంద్రం

Nov 23,2023 16:41 #Deepfake, #Social Media

న్యూఢిల్లీ  :  డీప్‌ఫేక్‌పై త్వరలోనే నూతన చట్టం రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డీప్‌ఫేక్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నేతృత్వంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఎఐ టూల్స్‌ మరియు నాస్కామ్‌లో అగ్రగామిగా ఉన్న కంపెనీలు మరియు ఎఐ రంగానికి చెందిన నిపుణులతో సమావేశమయ్యారు. ఈ రోజే ముసాయిదా నిబంధనలను రూపొందిస్తామని, త్వరలోనే డీప్‌ ఫేక్‌ల కోసం కొత్త నిబంధనలు లేదా కొత్త చట్టాన్ని రూపొందించే అవకాశం ఉందని అన్నారు.

డీప్‌ ఫేక్‌ సమాజానికి కొత్త ముప్పు అని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పునరుద్ఘాటించారు.ఈ అంశంపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నామని అన్నారు. డీప్‌ఫేక్‌ని గుర్తించడం, నిరోధించడం, రిపోర్టింగ్‌ మెకానిజం, అవగాహన పెంచడం అనే నాలుగు పిల్లర్స్‌ ఆధారంగా పదిరోజుల్లో స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. ఈ అంశంపై డిసెంబర్‌ మొదటి వారంలో మరోసారి సమావేశం కానున్నట్లు ప్రకటించారు.

➡️