దుంగార్‌గఢ్‌ ఎమ్మెల్యేకు ప్రజాదరణ – సిపిఎం అభ్యర్థికి ఊరురా

Nov 22,2023 10:39 #Assembly Elections, #cpm, #Rajasthan

జన నీరాజనం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దుంగార్‌గఢ్‌ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిర్దారిలాల్‌ మహియాకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రైతు నేతగా అందరికీ సుపరిచితులైన గిర్దారిలాల్‌ నిరాడంబర ఎమ్మెల్యేగా మంచి గుర్తింపు పొందారు. ఆయన చేపట్టిన ట్రాక్టర్ల యాత్ర వివిధ ప్రాంతాలు, గ్రామాలు చుట్డుముడుతూ మంగళవారం నాడు ఆయన సొంత గ్రామమైన దుల్చాసర్‌కి చేరుకోగా అక్కడి ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలికారు. సర్పంచ్‌తో సహా గ్రామ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 2018లో మహియా 23,896 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన మంగళారామ్‌ రెండో స్థానంలో, బిజెపికి చెందిన తారాచంద్‌ సరస్వత్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా వీరే ప్రత్యర్థులు. బిజెపి తిరుగుబాటు నేత ప్రీతి శర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్చోవడంతో సారస్వత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో రైతుల ఐక్య మద్దతు మహియాను భారీ మెజారిటీతో శాసనసభకు తీసుకొచ్చింది. సిపిఎం తొలిసారిగా 2008లో దుంగార్‌గఢ్‌లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మహియాకు 7,646 ఓట్లు వచ్చాయి. 2013లో పోటీ చేయలేదు. గతంలో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్‌కు కూడా ఒకసారి విజయం సాధించారు.

అవినీతి రహిత ఎమ్మెల్యేగా గుర్తింపు
మహియా ప్రజల అభ్యర్థి అని రైతు బికాంచంద్‌ అన్నారు. ‘ఆయన సాత్వికుడు. దుంగార్‌గఢ్‌లో తొలిసారిగా అవినీతి రహిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. పొలంలోని చిన్న కొట్టం(పాక)లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఐదేళ్లపాటు ప్రజల మధ్య పనిచేశారు. మాజీ ఎమ్మెల్యేలంతా గెలిచాక నియోజకవర్గం వైపు వెనుదిరిగి చూడలేదన్నారు’ అని బికాంచంద్‌ అన్నారు.

ప్రజాగొంతు, ఉద్యమకారుడు
ఎమర్జెన్సీ సమయంలో మహియాను జైలులో పెట్టి చిత్రహింసలు పెట్టారు. వేరుశనగ సాగుకు కేంద్రమైన దుంగార్‌గఢ్‌లో రైతుల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. దుంగార్‌గఢ్‌ ప్రజలు వ్యవసాయానికి నీటి కోసం గొట్టపు బావులపై మాత్రమే ఆధారపడతారు. 2016-17లో మహియా విద్యుత్‌ కోసం పెద్ద ఆందోళనకు నాయకత్వం వహించారు. నాటి వసుంధర రాజే ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. మహియాపై దాడులు చేయించారు. జైల్లో కూడా పోరాటం కొనసాగింది. ప్రభుత్వం తలొగ్గింది. దుంగార్‌గఢ్‌లో రైతులకు సరిపడా కరెంటు వచ్చింది.

ఐదేళ్ల కృషే గెలిపిస్తుంది : గిర్దారీలాల్‌
ఐదేళ్ల పాటు దుంగార్‌గఢ్‌ ఎమ్మెల్యేగా తాను చేసిన కృషే, తనను మళ్లీ గెలిపిస్తుందని గిర్దారీలాల్‌ మహియా అన్నారు. ప్రజాశక్తి ప్రతినిధితో ఫోన్‌లో ఆయన మాట్లాడారు. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న దుంగార్‌గఢ్‌కు కాలువ నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గంగానగర్‌లోని ఇందిరా కెనాల్‌ నుంచి నీటి సరఫరా ప్రాజెక్టు ప్రారంభించామని తెలిపారు. దుంగార్‌గఢ్‌లో ట్రామాకేర్‌ కేంద్రం ప్రారంభమైందన్నారు. విద్యా, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, కొత్తగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు కొత్త కాలేజీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. డిగ్రీ కళాశాలను పిజి కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయించినట్లు పేర్కొన్నారు.

➡️