ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో రాబోయేది తమ సర్కారేనని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షులు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట గాంధీనగర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఎస్‌పి అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం జరిగిన బహిరంగసభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. దేశంలో సంపన్న వర్గాల కోసం కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పనిచేస్తున్నాయని, కానీ బిఎస్‌పి మాత్రం బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో నడుపబడుతున్న ఏకైక పార్టీ అని తెలిపారు. సబ్బండవర్గాలకు అండగా ఉండే బిఎస్‌పి.. ఈ ఎన్నికల్లో సత్తా చాటుతుందని తెలిపారు. తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని, శాంతి భద్రతలు క్షీణించాయని, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని కోరారు. ఉత్తరప్రదేశ్ మాదిరి తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని కోరారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా.. వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళా కోటాలో ఎస్‌సి, ఎస్‌టి కోటా ఉండాలని.. మొదటి నుంచి బిఎస్‌పి ఈ విషయం చెప్తోందన్నారు. ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను తమ పార్టీ గెలవబోతోందని అన్నారు. జానయ్య ఏర్పాటు చేసిన సభను విఫలం చేయడానికి మంత్రి, పోలీసులు ప్రయత్నాలు చేసినా ప్రజలు భారీగా తరలివచ్చారన్నారు. బిసి వాదం ఎత్తుకున్నందుకు జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి 70కి పైగా కేసులు పెట్టించారని విమర్శించారు. అభ్యర్థి వట్టెజానయ్య యాదవ్ మాట్లాడుతూ.. చావు నోట్లోకి వెళ్లి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి వచ్చానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అగ్ర వర్ణాల అభ్యర్థులపై తన గెలుపు ఖాయమన్నారు.