సంధి వేళా.. ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం

Nov 27,2023 09:06 #Gaza

– వెస్ట్‌బ్యాంక్‌పై దాడి ..8 మంది పౌరులు మృతి

గాజా స్ట్రిప్‌ : కాల్పుల విరమణ, బంధీల మార్పిడి ఒకవైపు కొనసాగుతుండగానే…సంధి కాలంలోనూ ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో ఊగిపోయింది. శరణార్థి శిబిరాలను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని నెతన్యాహూ సైన్యం దాడులకు పాల్పడింది. శని, ఆదివారాల్లో 24 గంటల పాటు సాగిన ఇజ్రాయిల్‌ కాల్పుల్లో వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలో 8 మంది సాధారణ పౌరులు చనిపోయారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. జెనిన్‌ శరణార్థి శిబిరంలో ఐదుగురు చనిపోగా..సెంట్రల్‌ వెస్ట్‌బ్యాంక్‌లో ఒకరు, ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే కాల్పులను సమర్థించుకునేందుకు ఇజ్రాయిల్‌ వక్రభాష్యాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇజ్రాయిల్‌కు చెందిన తండ్రీకొడుకులను కారుతో ఢకొీట్టి చంపిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లగా..అక్కడివారు తమపై దాడి చేయడంతో కాల్పులు జరిపినట్లు నెతన్యాహూ సైన్యం బుకాయిస్తోంది. ఈ ఘటనలో చనిపోయినవారంతా ఉగ్రవాదులేనని ప్రకటించింది. హమాస్‌ సీనియర్‌ కమాండర్‌ మృతి కాగా ఇజ్రాయిల్‌ జరిపిన మరో దాడిలో హమాస్‌ సీనియర్‌ కమాండర్‌ ఒకరు చనిపోయారు. ఈ విషయాన్ని హమాస్‌ కూడా ధ్రువీకరించింది. ఉత్తర గాజా ప్రాంతానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న అహ్మద్‌ అల్‌ ఘాందౌర్‌ అనే బ్రిగేడ్‌ కమాండర్‌ ఇజ్రాయిల్‌ దాడిలో మరణించినట్లు హమాస్‌ పేర్కొంది. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ మరణించారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ దాడిలో మరో ముగ్గురు మిలిటరీ నేతలూ చనిపోయినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌తో సాగుతోన్న యుద్ధంలో ఇప్పటివరకు మఅతిచెందిన హమాస్‌ సభ్యుల్లో ఇతడే కీలకమైన వ్యక్తి అని అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గతంలో ఇజ్రాయెల్‌ హత్యాప్రయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నట్లు తెలిపాయి. 2017లో అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆర్థిక ఆంక్షలూ విధించింది. అంతకుముందు నిరిమ్‌ మారణకాండకు బాధ్యుడైన బిలాల్‌ అల్‌ కేద్రా, హమాస్‌ ఏరియల్‌ ఫోర్స్‌ హెడ్‌ అబు మురద్‌, నక్బా యూనిట్‌ కమాండర్లు అహ్మద్‌ మౌసా, అమర్‌ అల్హంది తదితరులను ఇజ్రాయెల్‌ సైన్యం చంపేసింది. ఈ ఏడాది అక్టోబరు 7న హమాస్‌ మెరుపు దాడుల నేపథ్యంలో ఉత్తర గాజాను ఇజ్రాయెల్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుని భీకరదాడులు సాగిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

➡️