41మంది కార్మికులు.. సొరంగం పైనుండి డ్రిల్లింగ్‌కు కసరత్తు

Nov 25,2023 11:33 #Drilling, #top, #Tunnel, #workers

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. అధికారులు ముమ్మరంగా చర్యలను చేపడుతున్నారు. ప్రస్తుతం లోపల నుంచి డ్రిల్లింగ్‌ పనులు సాగుతున్నప్పటికీ ఆటంకాలు తలెత్తుతుండటంతో సొరంగం పైనుంచి కూడా డ్రిల్లింగ్‌ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని జియోఫిజికల్‌ నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నిపుణులు నేషనల్‌ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌డీసీఎల్‌)కి సమర్పించారు. సొరంగం పైనుండి కూడా డ్రిల్‌ చేయడానికి ప్రణాళిక…సొరంగం లోపల నుండి బాధిత కార్మికులను చేరేందుకు మార్గం ఏర్పడని పక్షంలో సొరంగం పైనుండి కూడా డ్రిల్‌ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కసరత్తు ప్రారంభించారు. డ్రిల్లింగ్‌ చేయాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిని జియోఫిజికల్‌ నిపుణులు పరిశీలించారు.నీటి వనరు అడ్డుపడితే ప్రమాదం… ఈ సందర్భంగా పార్సన్‌ కంపెనీకి చెందిన జియోఫిజికల్‌ నిపుణుడు బి.భాస్కర్‌ మాట్లాడుతూ … ఆ స్థలాన్ని పరిశీలించామని, డ్రిల్‌కు ఆ ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు అడ్డురావని తేలిందన్నారు. కాగా డ్రిల్లింగ్‌ సమయంలో ఏదైనా నీటి వనరు అడ్డుపడితే మొత్తం ఆపరేషన్‌తో పాటు 41 మంది కూలీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ఇతర ఎంపికలలో భాగంగా సొరంగం పై నుండి డ్రిల్‌ చేయడానికి అతిపెద్ద డ్రిల్‌ యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాగాలుగా తీసుకొచ్చారు. తరువాత దానిని అనుసంధానించారు. ఇతర డ్రిల్‌ యంత్రాలను కూడా ఇక్కడకు తీసుకువచ్చారు.

తాజా వార్తలు

➡️