‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 13:27 #Governor, #Supreme Court

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బిజెపి నియమించిన గవర్నర్‌ ఉద్దేశపూర్వకంగా బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం చేస్తున్నారని, ” ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడం ” ద్వారా రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆ పిటిషన్‌లో పేర్కొంది.

2020 సంవత్సరం నుండి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మూడేళ్లుగా వాటిని ఆమోదించకుండా ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. పంజాబ్‌, కేరళ ప్రభుత్వాల ఇటువంటి పిటిషన్‌లను విచారిస్తున్న ధర్మాసనం ”ఒక బిల్లును అసెంబ్లీకి తిరిగి పంపకుండా గవర్నర్‌ ఆమోదాన్ని నిలిపివేయగలరా ” అనే అంశాన్ని కూడా లేవనెత్తింది. ” తమిళనాడు అసెంబ్లీ మళ్లీ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ ఏం చేస్తారో చూద్దాం ” అని ధర్మాసనం పేర్కొంది. సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తమిళనాడు ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు.

ఈ బిల్లులను ఆమోదించకుండా నిలుపదల చేయడంపై వివరణనివ్వాల్సిందిగా కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను ధర్మాసనం ఆదేశించింది. గవర్నర్‌ కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లపై తదుపరి విచారణను డిసెంబర్‌ 1కి వాయిదా వేసింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది కె.కె. వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఏడు నుండి 23 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్టికల్‌ 168 ప్రకారం.. గవర్నర్‌ శాసనసభలో భాగమని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు విరుద్ధంగా గవర్నర్‌ వ్యవహరించలేరని అన్నారు.

➡️