చంద్రబాబుకు సుప్రీం నోటీసు- 8లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోటిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై డిసెంబరు 8లోగా రాతపూర్వకంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో 17ఏపై తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులను పొడిగించాలని కోర్టును కోరారు. అలాగే ‘ఈ కేసు గురించి పబ్లిక్‌ డొమైన్‌లో ఎటువంటి ప్రకటన చేయకూడదు’ అని అన్నారు. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ అగర్వాల్‌ జోక్యం చేసుకుని అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆ శాఖ అధికారులు ఇప్పటికీ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ‘స్కిల్‌ కేసుపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండటానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ అదే షరతు రెండు వైపులా వర్తింపజేయాలి’ అని పేర్కొన్నారు. దీనికి సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘షరతు నిందితుడికి వర్తిస్తుంది. అది ప్రభుత్వానికి వర్తించదు’ అని అన్నారు. నోటీసు జారీ చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు అంగీకరించడమే కాకుండా, ఈ కేసు నుంచి ఉత్పన్నమయ్యే సబ్‌ జ్యూడీస్‌ విషయాల గురించి పబ్లిక్‌ డొమైన్‌లో మాట్లాడకుండా చంద్రబాబుకు బెయిల్‌ షరతును కొనసాగించాలని ఆదేశించింది. అయితే, రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, పాల్గనడంపై నిషేధం విధించే ఇతర బెయిల్‌ షరతును విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది.

➡️