గాజా : ఇజ్రాయిల్ మరియు హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రోజు పొడిగించినట్లు ఖతార్ గురువారం స్పష్టం చేసింది. గడువు ముగియడానికి కొన్ని నిమిషాల మందు పొడిగించేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్లు ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ తెలిపింది. గురువారం ఉదయం యుద్ధ విరమణ గడువు ముగియనుంది. గడువు పొడిగింపుపై చర్చలు జరిగాయని అన్నారు. హమాస్ విడుదల చేసే బందీలపై చివరి నిమిషంలో విభేదాలు వచ్చినప్పటికీ.. సుధీర్ఘ చర్చల అనంతరం మరో రోజు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. శుక్రవారం వరకు ఒప్పందం కొనసాగుతుందని వెల్లడించింది.
30 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ రోజుకు పది మంది ఇజ్రాయిలీ బందీలను విడుదల చేసిన నిబంధనల ప్రకారం సంధిని పొడిగించినట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్, ఈజిప్ట్ మరియు అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిదరిన ఒప్పందం ప్రకారం.. బందీలుగా ఉన్న ఆరు గ్రూపులు విడుదల చేయబడ్డాయి. థాయిలాండ్‌కు చెందిన నలుగురు బందీలు విడుదల కాగా, ఇజ్రాయిల్, రష్యా పౌరసత్వం కలిగిన ఇద్దరు మహిళలు బుధవారం ఈజిప్ట్‌కు చేరుకున్నారు.