భారత్‌ అప్పీల్‌ను విచారించేందుకు సమ్మతించిన ఖతార్‌

Nov 24,2023 11:24 #Death Penalty, #India, #Qatar

దోహా : గూఢచర్యం ఆరోపణల కేసులో గత నెలలో శిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్షపై భారత్‌ చేసిన అప్పీల్‌ను విచారించేందుకు ఖతార్‌ కోర్టు అంగీకరించింది. అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత ఖతార్‌ కోర్టు విచారణ తేదీని ప్రకటిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. మాజీ నేవీ అధికారులందరూ భారత నౌకాదళంలో 20 ఏళ్ల వరకు విశిష్ట సేవా రికార్డును కలిగి ఉన్నారు. శిక్షకులతో పాటు పలు కీలక పదవులను నిర్వహించారు.

నివేదిక ప్రకారం.. భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులను గూఢచర్యం కేసులో ఖతార్‌ గతేడాది ఆగస్టులో అరెస్ట్‌ చేసింది. అయితే వారిపై ఉన్న ఆరోపణలను ఖతార్‌ బహిరంగ పరచలేదు. వారి బెయిల్‌ పిటిషన్‌లను అనేకసార్లు తిరస్కరించింది. ఖతార్‌లోని ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ కోర్టు గత నెలలో వారికి మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. వారికి అక్కడి న్యాయస్థానం అక్టోబర్‌ చివరి వారంలో మరణశిక్ష విధించింది. అదుపులోకి తీసుకున్న మాజీ అధికారులలో ఒకరి సోదరి మీతూ భార్గవ తన సోదరుడిని విడిపించేందుకు జోక్యం చేసుకోవాలంటూ ఈ ఏడాది జూన్‌ 8న ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేసింది.

➡️