గడిచిన 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు మీడియా వర్కర్లు మృతి

Nov 20,2023 17:15 #israel hamas war, #Journalist

గాజా :   ఇజ్రాయిల్‌ దాడుల్లో గడిచిన 24 గంటల్లో నలుగురు జర్నలిస్టులు, ముగ్గురు స్థానిక మీడియా కార్మికులు మరణించారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ జరిపిన లక్షిత బాంబు దాడుల్లో సుమారు 40 మంది జర్నలిస్టులు మరణించారు. సెంట్రల్‌ గాజాలోని అల్‌ బురీజ్‌ శరణార్థి శిబిరంపై జరిపిన బాంబుదాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సారి మన్సూర్‌, హసౌనెహ్ సలీంలు మరణించారు. బిబిసికి చెందిన మరో ప్రముఖ పాత్రికేయుడు, పాలస్తీనా రాజకీయ వ్యవహారాల విశ్లేషకుడు ముస్తఫా అల్‌ సవాఫ్‌ మరణించారు. అతని నివాసం లక్ష్యంగా ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన బాంబు దాడిలో ఆయన మరణించారు. స్థానిక ఫోటో జర్నలిస్ట్‌ ముసాబ్‌ అషౌర్‌, అల్‌ అక్సా రేడియోలో పనిచేసే వ్యక్తి అబ్దుల్‌హమిద్‌ అవద్‌, అల్‌ అక్సా టెలివిజన్‌ ఛానెల్‌కి చెందిన అమర్‌ అబు హయ్యాలు మరణించారు. మృతుల్లో ప్రెస్‌ హౌస్‌ డైరెక్టర్‌ బిలాల్‌ జదల్లా కూడా ఉన్నారు. గాజా సిటీలోని ఆయన కారుపై బాంబులు వేసినట్లు హమాస్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీస్‌ తెలిపింది. ఈ చర్యలు జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ వ్యూహాత్మక, లక్షిత దాడులను వివరించాయని పేర్కొంది. గాజాపై ఇజ్రాయిల్‌ దాష్టీకాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న జర్నలిస్టులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. బాంబు దాడులతో పాటు కమ్యూనికేషన్‌ లేకపోవడం, అంతరాయం, విద్యుత్‌ కొరత వంటివి ఉన్నాయని వెల్లడించింది.

➡️