హమాస్‌ చీఫ్‌ నివాసంపై బాంబు దాడి : ఐడిఎఫ్‌ వెల్లడి

Nov 16,2023 16:30 #Gaza, #Israel

గాజా :   హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియే నివాసంపై తమ సైన్యం బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) గురువారం తెలిపింది. గాజాలోని ఓ నివాసంపై యుద్ధ విమానాలు బాంబులు వేస్తున్న వీడియోను ఐడిఎఫ్‌ విడుదల చేసింది. ఆ నివాసం ఇస్మాయిల్‌ హనియేదని ఐడిఎఫ్‌ వాదిస్తోంది. హనియే నివాసాన్ని ఉగ్రవాదుల అవసరాల కోసం, ఇజ్రాయిల్‌ పౌరులు, ఐడిఎఫ్‌ సైనికులపై దాడులను నిర్దేశించడానికి సీనియర్‌ హమాస్‌ నేతల సమావేశ కేంద్రంగాను వినియోగించినట్లు ఐడిఎఫ్‌ ఆరోపిస్తోంది. హమాస్‌ నావికాదళానికి చెందిన ఆయుధ సామగ్రిని గుర్తించడంతో పాటు ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్‌ పేర్కొంది. వీటిలో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, డైవింగ్‌ గేర్‌లు ఉన్నట్లు తెలిపింది.

ఇస్మాయిల్‌ హనియే హమాస్‌ అధ్యక్షుడు మరియు గాజాను పరిపాలించే అత్యున్నత స్థాయి అధికారులలో ఒకరు. ఆయనను హమాస్‌ చీఫ్‌గా పలు దేశాలు పరిగణిస్తుంటాయి. ఆయన 1990 చివరలో వెలుగులోకి వచ్చాడు. 2004లో హమాస్‌ వ్యవస్థాపకుడు షేక్‌ అహ్మద్‌ యాసిన్‌ హత్యకు గురయ్యేంతవరకు ఇస్మాయిల్‌ ఆయనకు కుడి భుజంగా వ్యవహరించారు. అనంతరం 2006లో పాలస్తీనా ప్రధానిగా ఎన్నికయ్యారు. 2017లో హమాస్‌ నేతగా ఎంపికవడంతో పాటు గాజా వెలుపలి నుండి హమాస్‌ రాజకీయ కార్యకలాపాలను నియంత్రించేవారు.

➡️