వాషింగ్టన్ : అమెరికా విదేశాంగ విధానంలో చెరగని ముద్రవేసిన ప్రముఖ దౌత్యవేత్త, నోబెల్ బహుమతి విజేత హెన్రీ కిసింజర్ (100) మరణించారు. బుధవారం కనెక్టివిటీలోని నివాసంలో మరణించినట్లు కిసింజర్ అసోసియేట్స్ తెలిపింది. అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ హయాంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1923 మే 7న జర్మనీలో కిసింజర్ జన్మించారు. 1938లో ఆయన కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యంలో సేవలు అందించారు. హార్వర్డ్ నుంచి పట్టా పొందిన ఆయన అదే యూనివర్శిటీలో 17 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన ప్రభుత్వ ఏజెన్సీలకు కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించారు. వియత్నాంలో విదేశాంగ శాఖకు మధ్యవర్తిగా సేవలు అందించారు.
వందేళ్ల వయస్సులోనూ ఆయన చురుకుగా ఉండేవారు. వైట్‌హౌస్‌లో సమవేశాలకు హాజరుకావడంతో పాటు నాయకత్వ శైలిపై పుస్తకాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జులైలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యేందుకు ఆకస్మికంగా బీజింగ్‌లో పర్యటించారు.