మయన్మార్‌ మాజీ కల్నల్‌కి దేశద్రోహం కేసులో పదేళ్ల జైలు శిక్ష   

నైఫిడో :   గతంలో సమాచార మంత్రిగా, అధ్యక్ష ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఆర్మీ అధికారి యే హ్టుట్‌ (64)ను జుంటా సైన్యం దేశద్రోహం కేసులో దోషిగా నిర్థారించింది. ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఓ న్యాయ అధికారి గురువారం తెలిపారు. తప్పుడు, రెచ్చగొట్టే వార్తలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తున్నారంటూ అరెస్టై జైళ్లలో మగ్గుతున్న ప్రముఖ వ్యక్తులలో యే హ్టుట్‌ కూడా ఉన్నారు.

2021లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన అంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి జుంటా సైన్యం మయన్మార్‌ పాలనను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి మయన్మార్‌లో పలువురిని దేశద్రోహం పేరుతో జైలు పాలు చేస్తోంది. కొంత మంది సీనియర్‌ సైనిక అధికారులపై అవినీతి ఆరోపణలు సహా పలు కేసులతో తొలగించిన అనంతరం యాంగోన్‌ రీజనల్‌ మిలటరీ కమాండ్‌కు చెందిన ఓ సైనిక అధికారి యేహ్టుట్‌ను కూడా తొలగిస్తున్నట్లు ప్ర కటించారు. అనంతరం దేశద్రోహం ఆరోపణలతో ఆయనను అక్టోబర్‌లో జుంటా ప్రభుత్వం అదుపులోకి తీసుసకుంది. బుధవారం విచారణ అనంతరం దోషిగా నిర్థారించినట్లు పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ న్యాయ అధికారి తెలిపారు.

సైనిక మద్దతు కలిగిన థీన్‌సీన్‌ ప్రభుత్వంలో .. 2013 నుండి 2016 వరకు యేహ్టుట్‌ ఆయనకు ప్రతినిధిగా త వ్యవహరించారు. 2014 నుండి 2016 వరకు సమాచార మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. 2016లో ప్రభుత్వం నుండి వైదొలిగిన తర్వాత రాజకీయ వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టడంతో పాటు పలు పుస్తకాలు రచించారు. ఫేస్‌బుక్‌లో కథనాలు పోస్ట్‌ చేసేవారు. కొంతకాలం సింగపూర్‌లోని ఐఎస్‌ఇఎఎస్‌-యూసఫ్‌ ఇషాక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విజిటింగ్‌ సీనియర్‌ రీసెర్చ్‌గానూ పనిచేశారు.

జుంటా సైన్యం మయన్మార్‌పై అణచివేతలో భాగంగా 4,204 మంది పౌరులు మరణించగా, సుమారు 25,474 మందిని అదుపులోకి తీసుకుంది.

➡️