బందీల పరస్పర మార్పిడి
ఖతార్ మధ్యవర్తిత్వంలోకుదిరిన డీల్
నాలుగు రోజుల తరువాత మళ్ళీ యుద్ధం: నెతన్యాహు
గాజా/ జెరూసలెం : గాజాపై దాడులను వెంటనే ఆపాలంటూ ప్రపంచవ్యాపితంగా పెద్దయెత్తున ర్యాలీలు, ప్రదర్శనలు రోజురోజుకీ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దిగివచ్చి తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించింది. తమ వద్ద ఉన్న బందీలను మార్పిడి చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఖతార్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయిల్, అమెరికా అధికారులకు, హమాస్ ప్రభుత్వానికి మధ్య బుధవారం ఈ మేరకు డీల్ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఉంటుంది. అమెరికా, తన మిత్రపక్షమైన ఇజ్రాయిల్ దీనిని ఒక చిన్న ఆటవిడుపుగా అభివర్ణించాయి. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ‘మేము యుద్ధంలో ఉన్నాం. మాలక్ష్యాలన్నీ నెరవేరేంతవరకు యుద్ధాన్ని కొనసాగిస్తాం. హమాస్‌ను నాశనం చేయడం, బందీలందరినీ తమకు అప్పగించడం, ఇజ్రాయిల్‌కు ముప్పు కలిగించేవారెవరూ గాజాలో లేకుండా చేయడం ఇవే ఆ లక్ష్యాలు ‘ అని చెప్పారు. గాజాలో ప్రజలకు నీరు, ఆహారం, ఇంధనం, మందులు వంటి అత్యవసరాలను నిలిపేసి వారిని అశక్తులను చేయడం, మరో వైపు నుంచి టన్నుల కొద్దీ బాంబులను కురిపించడం ద్వారా జాతి నిర్మూలన చేయడమే నెతన్యాహు అసలు లక్ష్యం. గత ఆరు వారాలుగా సాగిస్తున్న మారణహౌమంలో 14వేల మంది అమాయక పాలస్తీనా పౌరులు చనిపోయారు. మిగిలిన వారిని బలవంతంగా బయటకు వెళ్లగొడుతోంది. ఈ నాలుగు రోజుల కాల్పుల విరమణ గడువును ఇజ్రాయిల్ తన సైనిక శక్తిని మరింతగా కూడదీసుకుని గాజాపైన, ఇరాన్, సిరియా, లెబనాన్‌లపై యుద్ధానికి తెగబడాలని చూస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారు జాము నుండి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం హమస్ చేతిలో బందీలుగా ఉన్న వారిలో 50-100 మందిని విడుదల చేస్తుంది. వీరిలో సైనికులు మినహా ఇజ్రాయిలీ పౌరులు, ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. దీనికి ప్రతిగా తమ జైళ్ళలో మగ్గుతున్న 150మంది ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయాల్సి వుంటుందని తెలిపింది. బందీల్లో 33మంది మహిళలు, 123మంది మైనర్లు వున్నారు. వీరందరూ 2021 నుండి నిర్బంధంలో వున్నారు. కాల్పుల విరమణ ఒప్పంద గడువును పెంచాలని సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్‌ల విదేశాంగ మంత్రులు కోరారు. లండన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరు, ఈ కాల్పుల విరమణ ఒప్పందం అంతిమంగా రెండు దేశాల ఏర్పాటు దిశగా చర్చల పునరుద్ధరణకు దారి తీయగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, శరణార్ధ శిబిరాలపై కొనసాగుతున్న దాడులుగాజాలో ఆస్పత్రులు, శరణార్ధ శిబిరాలపై మంగళవారం రాత్రి బుధవారం ఉదయం కూడా జరిగిన దాడుల్లో దాదాపు వందమందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరందరినీ సామూహిక ఖననం చేశారు. ఆస్పత్రుల్లో, చుట్టుపక్కలా పరిస్థితులు భయంకరంగా వున్నాయని కమల్ అద్వాన్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. తమ ఆస్పత్రికి గత రాత్రి నుండి 60వరకు మృత దేహాలు, వెయ్యి మందికి పైగా గాయపడిన వారు వచ్చారని చెప్పారు. వైద్య బృందాలకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకడం లేదని, ఒక్క చుక్క కూడా ఇంధనం లేకపోవడంతో చేతుల్లో టార్చిలైట్లు పట్టుకుని చీకట్లోనే ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రికి చుట్టుపక్కలా బాంబు దాడులతో భయానకమైన పరిస్థితి నెలకొందని సరైన దిశగా కీలక చర్యకాల్పుల విరమణ సరైన దిశలో తీసుకున్న ఒక కీలకమైన చర్యగా ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా వుందని పేర్కొంది. కాల్పులు విరమించిన ఈ సమయాన్ని బందీల విడుదలకు, గాజాలోని పాలస్తీనియన్ల దుస్థితిని తప్పించేలా వారి అవసరాలు తీర్చేందుకు ఉపయోగించాలని మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక కోఆర్డినేటర్ టార్ వెనెస్‌లాండ్ సూచించారు. అంతర్జాతీయ సమాజం స్పందనమానవతా సంక్షోభాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు. ఇదొక కీలకమైన చర్య అని బ్రిటన్ వ్యాఖ్యానించింది. చాలా కాలం తర్వాత విన్న మొదటి మంచి వార్తగా రష్యా పేర్కొంది. గాజాలో మానవతా సాయం పెంచడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వ్యాఖ్యానించారు.