ఇజ్రాయెల్ : దక్షిణ గాజాలోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతం నుంచి తరలిపోవాలని ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గాజావాసులకు మళ్లీ వలసబాట తప్పేలా లేదు. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టిపెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడిఎఫ్.. పౌరులు తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇజ్రాయెల్ అధికారి హెచ్చరిక : ” ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. అయితే, ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం ” అని ఓ ఇజ్రాయెల్ అధికారి వెల్లడించారు. దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో 4 లక్షల వరకు జనాభా ఉంటారు. దీనికి తోడు.. ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడటం వల్ల అనేక మంది దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారు. ఇప్పుడు వీరందరినీ పశ్చిమ ప్రాంతానికి తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసింది.