టెహ్రాన్ : ఇటీవల గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ జరిపిన మారణకాండను ఇరాన్ ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న అల్-ఫకూరా విద్యా సంస్థపై ఇజ్రాయిల్ ఇటీవల వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేపడుతున్న నరమేథంపై అంతర్జాతీయ సమాజం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడంతో ఇటువంటి క్రూరత్వం చోటుచేసుకుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కానాని తెలిపారు. అంతర్జాతీయ మానవతా చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయిల్ రోజురోజుకూ పాలస్తీనాపై కొత్త నేరాలు, ఊచకోతలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 12,000కు పైగా పాలస్తీనియన్లు మరణించగా, 32,000 మంది గాయపడ్డారు. మృతుల్లో 4,900 మంది చిన్నారులు, 3,155 మంది మహిళలు ఉన్నారు.