అదే జోరును కొనసాగించాలి..

Nov 25,2023 22:06 #Sports

రేపు ఆస్ట్రేలియాతో రెండో టి20పొంచి వున్న వర్షం ముప్పు?

తిరువనంతపురం: తొలి టి20లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టి20కి సిద్ధమైంది. విశాఖలో ఆసీస్‌ నిర్దేశించిన 208పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యలో ఉన్న భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యతను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. నేడు ఉదయం, మధ్యాహ్నం వర్ష సూచన ఉందని ఇక్కడి వాతావరణ శాఖ తెలిపింది. కానీ, సాయంత్రం వర్షం తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొంది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని యువభారత్‌.. తిరువనంతపురంలోనూ జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఆసీస్‌ జట్టు తొలి టి20లో ఓడిన షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేదు. ఆ జట్టు వికెట్‌ కీపర్‌ ఇంగ్లిస్‌ సెంచరీతో కదం తొక్కినా ఆ జట్టు పరాజయాన్ని చవిచూసిందీ. దీంతో ఆసీస్‌ బోణీ కొట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. వైజాగ్‌ టి20లో సూర్యకుమార్‌ యాదవ్‌ (80; 42 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌(58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టును గెలుపు వాకిట నిలిపారు. చివర్లో రింకూ సింగ్‌(28నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించిన తీరు వర్ణణాతీతం. దాంతో, భారత్‌ ఈ ఫార్మాట్‌లో 209 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి పోరులో వాషింగ్టన్‌ సుందర్‌, అవేశ్‌ ఖాన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నారు. జట్లు(అంచనా)…భారత్‌: యశస్వీ జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌కిషన్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌(కెప్టెన్‌), తిలక్‌వర్మ, శివమ్‌దూబే, రింకూసింగ్‌, అక్షర్‌పటేల్‌, రవి బిష్ణోరు, అర్ష్‌దీప్‌సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ముకేశ్‌కుమార్‌.ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ షార్ట్‌, ఆరోన్‌ హార్డీ, జోష్‌ ఇంగ్లిస్‌, స్టొయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌)), సియాన్‌ అబాట్‌, నాథన్‌ ఎల్లిస్‌, బెహెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంగా.

➡️