దుబాయ్: అమెరికా, వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్‌కు నమీబియా అర్హత సాధించింది. నమీబియా రాజధాని విండ్‌హౌక్ వేదికగా జరిగిన ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్ ఆఫ్రికా రీజియన్ అర్హత పోటీల్లో నమీబియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాప్‌లో నిలిచింది. మంగళవారం టాంజానియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియా 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. అనంతరం టాంజానియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 99 పరుగులే చేయగలిగింది. టి20 ప్రపంచ కప్‌కు నమీబియా అర్హత సాధించడం వరుసగా ఇది మూడోసారి. ఇక రెండో స్థానం కోసం ఉగాండా, కెన్యాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉగాండా, కెన్యాలు తలా నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచి ఆరు పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నాలుగో స్థానంలో ఉన్న జింబాబ్వే.. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో ఉంది. ఆ జట్టు కూడా రెండు మ్యాచ్‌లో ఆడాల్సి ఉండగా రెండు గెలిచినా ఆ జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.