మార్ష్‌పై కేసు నమోదు

Nov 24,2023 22:20 #Sports

లక్నో : ఆస్ట్రేలియా బ్యాటర్‌ మిఛెల్‌ మార్ష్‌పై కేసు నమోదైంది. వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి దిగిన ఫొటో మార్ష్‌పై కేసుకు కారణమైంది. ఇటీవలే భారత్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో మార్ష్‌ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టడం, చేతిలో బీరు బాటిల్‌తో దిగిన ఫొటో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటో కాస్తా బైటకు రావడంతో అతడిపై క్రికెట్‌ అభిమానులు, నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రపంచకప్‌ను ఎంతో గొప్పగా భావించే వారంతా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంత అహంకారమా’ అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్‌ కేశవ్‌.. మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేశవ్‌ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు.

➡️