- భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
- తొలి టి20లో ఆసీస్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపు
- ఇంగ్లిస్ సెంచరీ వృథా
విశాఖపట్నం : ఐసిసి వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 209పరుగుల భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 7పరుగులు చేయాల్సి దశలో తొలి రెండు బంతులకు ఐదు పరుగులు చేసినా.. ఆ తర్వాత రెండు బంతుల్లో ఇద్దరు రనౌట్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఐదో బంతికి రెండు పరుగులు చేసే క్రమంలో ఆర్ష్‌దీప్ రనౌటయ్యాడు. దీంతో అబట్ వేసిన 6వ(నోబాల్) బంతిని రింకు సింగ్ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. తొలుత టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 208పరుగుల భారీస్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ కేవలం 50బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. అతడి స్కోర్‌లో 11ఫోర్లు, 8సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు, మాథ్యూ షార్ట్(13), స్మిత్ శుభారంభం ఇచ్చారు. కానీ, యువ స్పిన్నర్ రవి బిష్ణోరు తన తొలి ఓవర్లోనే షార్ట్‌ను బౌల్డ్ చేశాడు. స్టీవ్ స్మిత్ 41బంతుల్లో 8ఫోర్లతో 52 పరుగులు చేసి రనౌటయ్యాడు. దాంతో మొదటి వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బిష్ణోరును టార్గెట్ చేసిన ఇంగ్లిస్ అతడు వేసిన 12వ ఓవర్లో సిక్సర్‌తో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. అనంతరం ప్రసిధ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఉతికారేస్తూ శతకం సాధించాడు. టీ20ల్లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. చివరకు ప్రసిధ్ ఓవర్లో ఇంగ్లిస్.. భారీ షాట్ ఆడబోయి యశస్వీ జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత బౌరల్లలో ముఖేశ్ కుమార్ వికెట్ తీయకున్నా తక్కువ పరుగులిచ్చాడు. చివర్లో టిమ్ డేవిడ్(19నాటౌట్) ధాటిగా ఆడడంతో ఆసీస్ 200మార్కు దాటింది. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోరు, ప్రసిద్ధ్ కృష్ణకు వికెట్ తీశారు. ఛేదనలో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్(0), జైస్వాల్(21) నిరాశపరిచినా.. ఇషాన్(58), కెప్టెన్ సూర్యకుమార్(80) కలిసి 3వ వికెట్‌కు 122పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రింకు సింగ్(22నాటౌట్; 14బంతుల్లో 4ఫోర్లు)తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో టీమిండియా 19.5 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 209పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు సంఘ్వాకు రెండు, అబాట్, షార్ట్, బెహ్రెన్ డార్ఫ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్య కుమార్‌కు లభిం చగా.. రెండో టి20 తిరువనంతపురం వేదికగా 26న జరగనుంది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: స్టీవ్ స్మిత్ (రనౌట్) ప్రసిధ్/ముఖేశ్ 52, షార్ట్ (బి)బిష్ణోరు 13, ఇంగ్లిస్ (సి)జైస్వాల్ (బి)ప్రసిధ్ 110, స్టొయినీస్ (నాటౌట్) 7, టిమ్ డేవిడ్ (నాటౌట్) 19, అదనం 7. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 208పరుగులు. వికెట్ల పతనం: 1/31, 2/161, 3/180 బౌలింగ్: ఆర్ష్‌దీప్ సింగ్ 4-0-41-0, ప్రసిధ్ 4-0-50-1, అక్షర్ పటేల్ 4-0-32-0, రవి బిష్ణోరు 4-0-54-1, ముఖేశ్ కుమార్ 4-0-29-0ఇండియా ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)స్మిత్ (బి)షార్ట్ 21, గైక్వాడ్ (రనౌట్) ఎల్లిస్/వేడ్ 0, ఇషాన్ (సి)షార్ట్ (బి)సాంఘ్వా 58, సూర్యకుమార్ (సి)హార్డి (బి)బెహ్రెన్‌డార్ఫ్ 80, తిలక్ వర్మ (సి)స్టొయినీస్ (బి)సాంఘ్వా 12, రింకు సింగ్ (నాటౌట్) 28, అక్షర్ (సి అండ్ బి)అబట్ 2, బిష్ణోరు (రనౌట్)వేడ్/అబట్ 0, ఆర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) స్మిత్/అబట్ 0, ముఖేష్ కుమార్ (నాటౌట్) 0, అదనం 14. (19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 209పరుగులు. వికెట్ల పతనం: 1/11, 2/22, 3/134, 4/154, 5/194, 6/207, 7/207, 8/208 బౌలింగ్: స్టొయినీస్ 3-0-36-0, బెహ్రెన్‌డార్ఫ్ 4-1-25-1, షార్ట్ 1-0-13-1, అబట్ 3.5-0-43-1, ఎల్లిస్ 4-0-44-0, సంఘ్వా 4-0-47-0