సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి కరువు
పూర్తి చేయడానికి కొత్త గడువులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరోరాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమయిన ఉత్తరాంధ్ర జిల్లాల సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టులు పూర్తికి నోచుకోని పరిస్థితి వుంది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో రాష్ట్రంలో 54 ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించి వాటిని 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నాలుగన్నర ఏళ్లలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక ప్రాజెక్టులు పూర్తికి ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న తీరుపట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తాగు సాగునీటికి కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు దశాబ్దాలుగా సాగుతూనే వుంది. 2009లో మొదలు పెట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఈ ప్రాజెక్టును 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నాలుగన్నర ఏళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఇప్పుడు 2026 జూన్ నాటికి పూర్తిచేస్తామని అంటోంది. మరో కీలకమైన ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టుది అదే దారి. రూ.1,616 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును జూన్ 2020 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించగా, ఇప్పటివరకు మొదటిఫేజ్ మాత్రమే పూర్తయింది. 2024 ఫిబ్రవరిలో రెండో ఫేజ్ పూర్తి చేస్తామంటూ కొత్త లక్ష్యాన్ని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఈ నాలుగన్నర ఏళ్లలో రూ.90 కోట్లను ఖర్చు చేసింది. తోటపల్లి రిజర్వాయర్ కూడా నత్తనడకన సాగుతోంది. ప్రాజెక్టు లక్ష్యం 2020 జూన్ కాగా 2025 జూన్‌కు లక్ష్యాన్ని మార్చింది. రూ.198 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే తారకరామ తీర్థసాగర్‌ను కూడా 2020 సెప్టంబర్ నాటికి లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు 2025 జూన్ నెలకు మార్చారు. 18,500 ఎకరాలకు నీరందించే వంశధార నాగావళి ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో 70 శాతం పనుల వద్ద నిలిచిపోయింది. మద్దులవలస ఫేజ్-2 ప్రాజెక్టు ఈ ప్రభుత్వం వచ్చే నాటికే దాదాపు 80 శాతం పనులు పూర్తికాగా ఈ నాలుగన్నర ఏళ్లలో ఖర్చు చేసింది దాదాపుగా ఏమీ లేదు. మహేంద్రతనయ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. రూ.854 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కింద భూసేకరణ పనులు కూడా నోచుకోని పరిస్థితి వుంది. దాదాపు 15 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులకు ఈ నాలుగన్నర ఏళ్లలో రూ 450 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. రాష్ట్రంలో అత్యంత తక్కువ సాగునీటి వసతి వున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తోందనే విమర్శలూ ఉన్నాయి.